ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై బీజేపీ యువ నేత ఒకరు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. దీనిని అడ్డుకున్నందుకు ఆమెను కాల్చి చంపుతానని బెదిరింపులకు దిగాడు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌‌లో బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరిగిన గురువారం తెల్లవారుజామున ఈ ఘటనపై వైద్యుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైద్య సేవలకు అంతరాయం కలగడమే కాకుండా, నిందితుడ్ని 24 గంటల్లోగా అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. దీంతో బీజేపీ రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యుడు అనిల్ శ్రీవాస్తవతో పాటు అతడి అనుచరుడిపై పోలీసులు బీఎన్ఎస్ చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సాగర్‌లోని బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి లక్ష్మీ తివారీ అనే మహిళను అత్యవసర చికిత్స కోసం తీసుకువచ్చారు. అయితే, ఆమె ఆసుపత్రికి చేరుకోవడానికి ముందే చికిత్సకు సంబంధించి నిరంతరం ఫోన్ కాల్స్ వచ్చాయని ఆసుపత్రి సిబ్బంది ఆరోపించారు. చికిత్స సమయంలో రోగి వెంట వచ్చిన ఇద్దరు వ్యక్తులు వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించారు.బాధిత వైద్యురాలి ఫిర్యాదు ప్రకారం.. వారి ప్రవర్తనను తప్పుబట్టినప్పుడు నిందితుడు అనిల్ శ్రీవాస్తవ ఆమెను అసభ్యంగా తాకి శారీరకంగా వేధించడానికి ప్రయత్నించాడు. అంతకేాదు, ఆసుపత్రి నుంచి బయటకు రాగానే తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించాడు. ఆ ఇద్దరు వ్యక్తులు తమతో కూడా దురుసుగా ప్రవర్తించారని, భయభ్రాంతులకు గురిచేశారని నర్సింగ్ సిబ్బంది కూడా ఆరోపించారు. మహిళా వైద్యురాలి ఫిర్యాదు ఆధారంగా , అతడి సన్నిహితుడిపై భారతీయ న్యాయ సంహిత్‌లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు సాగర్ ఏఎస్పీ నరేంద్ర సోలాంకి ధ్రువీకరించారు. ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో నిందితులను అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు.ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది విధులను బహిష్కరించి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడ్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రిలో పలు విభాగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. రోగులు, వారి సహాయకులు గంటల కొద్ది ఎదురుచూపులు చూశారు.ఘటన జరిగిన వెంటనే పోలీసులకు, ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారం అందించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకునేలోపే నిందితులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారని నిరసన చేస్తున్న వైద్యులు ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రకారం.. పోలీసులు జోక్యం చేసుకునేలోపే భద్రతా సిబ్బంది రోగిని, ఆమెతో పాటు ఉన్నవారిని ప్రాంగణం బయటకు పంపారు. ఆ తర్వాత పోలీసులు ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండానే వెళ్లిపోయారని వారు తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రులలో రాత్రి షిఫ్టులలో పనిచేసే ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా మహిళా వైద్యుల భద్రతపై ఈ ఘటన తీవ్రమైన ఆందోళనలను బయటపెట్టిందని వైద్య సిబ్బంది అన్నారు. ‘ఆసుపత్రి లోపలే వైద్యులకు భద్రత లేకుంటే.. రోగుల సంరక్షణపై ప్రభావం చూపుతుంది’’ అని నిరసన ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్ ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం హామీ అనంతరం వైద్యులు తమ ఆందోళనను విరమించారు. అయితే, నిందితుడ్ని 24 గంటల్లోగా అరెస్ట్ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరిస్తామని మధ్యప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ హెచ్చరించింది. నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్న పోలీసులు.. బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీ వద్ద కూడా భద్రతను పెంచారు.ఆరోపణలపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ టైలర్‌ను వివరణ కోరగా.. ‘‘ప్రస్తుతానికి ఈ విషయం నా దృష్టికి రాలేదు. నేను ముందుగా వాస్తవాలను నిర్ధారించుకుని, ఆ తర్వాతే మాట్లాడుతాను’’ అని అన్నారు.