జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తన పెద్దమనసు చాటుకున్నారు. వర్షంలో తడుస్తూ బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను తన కారులో తీసుకెళ్లి ఊరిలో దిగబెట్టారు. శుక్రవారం రోజున అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొ్న్న కలెక్టర్ విజయ కృష్ణన్.. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే బంగారు మెట్ట కూడలి వద్ద కొంతమంది విద్యార్థులు వర్షంలో తడుస్తూ బస్సు కోసం ఎదురుచూస్తున్న సంగతిని కలెక్టర్ గమనించారు. వెంటనే కారును ఆపమని సిబ్బందికి చెప్పిన కలెక్టర్.. విద్యార్థులను తన వాహనంలోకి ఎక్కించుకున్నారు. ఏ ఊరికి వెళ్లాలనేదీ విద్యార్థులను వాకబు చేసి.. వారి సొంతూరు చిన్నప్పన్నపాలెంలో క్షేమంగా దింపారు. మరోవైపు జిల్లా కలెక్టర్ వాహనంలో ప్రయాణించడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకెంతో ఆనందంగా ఉందని.. బాగా చదువుకుని తాము కూడా ఆ స్థాయికి చేరుకుంటామని చెఫ్తున్నారు. మరోవైపు విద్యార్థుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించిన కలెక్టర్ తీరు పట్ల హర్షం వ్యక్తమవుతోంది. శనివారం ఈ జిల్లాలలో వానలు..మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా , ఏలూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఆస్కారం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖకర్ జైన్ వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు మత్స్యకారులు సముద్రంలోకి చేప వేటకు వెళ్ళరాదని.. ఇప్పటికే వెళ్లిన వారు వెంటనే వెనక్కి రావాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శనివారం రోజున రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి జిల్లా, పోలవరం జిల్లా, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మిగతాచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.