ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించిన జనసేనాని ను ప్రశ్నించే వారిలో ప్రముఖ నటుడు ఒకరు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ పై ప్రశ్నలు సంధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు సందర్భాల్లో ఆయన్ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పోస్టులు పెట్టారు. ఆయన విధివిధానాలను ప్రశ్నించడమే కాదు, అప్పుడప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు. ఇప్పుడు పరోక్షంగా పవన్ ను ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.''పోలీస్ డిపార్టమెంట్లో సేవ చేసిన మీ నాన్నగారి మీద మీకున్న గౌరవం కోసమైనా.. పదవి వచ్చిందని మీ కక్ష సాధింపులకి పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకోకండి'' అని ప్రకాష్ రాజ్ తాజాగా ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇక్కడ ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, ఇది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే అని అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ తండ్రి కొణిదెల వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న వ్యవహారం నేపథ్యంలోనే, పవన్ పై ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే, పోలీసులు అతనిపై మరో కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు చేశారు. ''ఎవరితో పొత్తు పెట్టుకున్నారో, వాళ్ళ జబ్బు మీకూ వచ్చినట్టుంది'' అని ఆయన పోస్ట్ చేశారు. ''అధికారాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి మీరు ఎంత దిగజారిపోతారు? రోజురోజుకూ మీ నిజస్వరూపం బయటపడి, మీరు నగ్నంగా నిలబడుతున్నారన్న విషయం మీకు అర్థమవుతోందా?'' అంటూ ప్రకాష్ రాజ్ ఓ వీడియోని షేర్ చేశారు. ప్రశ్న రావణ్ ను అర్థరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చారు. ఈ కేసులో అరెస్ట్ చేయలేమని కోర్టు అతడికి బెయిల్ ఇచ్చింది. వెంటనే ఇంకో కేసు వేసి మళ్లీ అరెస్ట్ చేస్తే, కోర్టు మళ్లీ బెయిల్ ఇచ్చింది. అతడ్ని మళ్లీ అరెస్ట్ చేస్తారా?. ఇలా ఇంకా 30 కేసులు రెడీగా ఉన్నాయి అంట కదా!. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటి ఈ కక్ష సాధింపు. మీ ఫస్ట్రేషన్ ను జనాలు చూస్తున్నారు'' అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా.. జనసేన కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోని ప్రకాష్ రాజ్ ఎక్స్ లో షేర్ చేస్తూ.. ''మీ జనసేన పార్టీ శ్రేణుల ఈ పని ఏమిటి. ప్రశ్నిస్తే చంపేస్తారా'' అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. మీరు ఈ రోగ్ ప్రవర్తనపై చర్య తీసుకుంటారా? అని పవన్ కళ్యాణ్ తో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడిని కూడా ట్యాగ్ చేశారు. తమ తండ్రి మీద గౌరవం కోసమైనా కక్ష సాధింపులకి పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకోకండి అంటూ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు.