ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు.. ఉత్తర్వులు జారీ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పని చేస్తున్న శాశ్వత ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లోని షెడ్యూలు 9, 10 పరిధిలోకి వచ్చే సంస్థల్లో పని చేసే శాశ్వత ఉద్యోగులకూ 62 ఏళ్లకు పదవీవిరమణ వర్తిస్తుంది. 2022లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కూడా తమకు కూడా కోరారు. కొంతమంది ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. ఉద్యోగుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ అంశంపై కసరత్తు చేసింది. ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందో అంచనాలు వేసి ఈ ప్రతిపాదనను కేబినెట్‌ ముందుకు తీసుకెళ్లి ఆమోదించారు.. తాజాగా ప్రభుత్వం జీవోను జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి పదవీ విరమణ పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఒకవేళ 60 ఏళ్లు పూర్తి చేసుకుని ఇప్పటికే ఎవరైనా ఉద్యోగులు పదవీ విరమణ పొంది ఉంటే.. వారిని 62 ఏళ్లు నిండే వరకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు. దీనికి తగిన విధంగా ఆయా సంస్థలు నిబంధనలు సవరించుకోవాలని సూచించారు అధికారులు. ఒకవేళ ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ ప్రయోజనాలు పొందితే కనుక వాటిని తిరిగి సంస్థకు చెల్లించాలి.. ఇక 60 ఏళ్లకు రిటైర్ అయినవాళ్లు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఆసక్తి లేని వారికి 60 ఏళ్ల రిటైర్మెంట్‌కే అనుమతిస్తారు.పదవీ విరమణ పొంది తిరిగి ఉద్యోగంలో చేరే వారికి.. ఉద్యోగంలో లేని సమయానికి జీతం ఇవ్వరు. నోషనల్ ప్రాతిపదికన వీరు ఉద్యోగంలో లేని కాలాన్ని వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ విడుదలకు పరిగణలోకి తీసుకుంటారు. వీరు సర్వీసులోకి చేరే తేదీ నుంచి నగదు ప్రయోజనం అమలవుతుంది. ఉద్యోగంలో లేని కాలాన్ని సీనియారిటీ, పదోన్నతుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. కోర్టు ఆదేశాలతో 62 ఏళ్ల పాటూ ఉద్యోగాల్లో కొనసాగిన వారికి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు ఇవ్వాలి. దీని కోసం ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు అవసరమైన నిబంధనలతో.. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఆర్థికశాఖ ద్వారా బడ్జెట్‌ అవసరాలకు ఆమోదం పొందాలి. మొత్తం మీద ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఊరట దక్కింది.