ఏపీలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ.. టీడీపీ నుంచి ఆ ఇద్దరికి ఛాన్స్?.. మరి ఆ నలుగురు?

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలవ్వబోతోంది. ఈ నెలలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఈ నెల 28తో శాసనమండలికి గవర్నర్ కోటాలో ఎన్నికైన శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ జాకియా ఖానం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం పూర్తవుతోంది. ఈ రెండు పదవుల భర్తీపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పదవుల రేసులో టీడీపీ నుంచి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీ అవుతున్న రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకదానికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో పదవి రాయలసీమకు కేటాయిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ ఇద్దరు నేతలు రాజ్యసభ ఎంపీ పదవులు ఆశించారు.. కానీ కొన్ని సామాజిక సమీకరణాలు, రాజకీయపరమైన అంశాలతో అవకాశం దక్కలేదు. అందుకే వీరిద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటుగా మరికొన్ని పేర్లు వినిపిస్తున్నా.. అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనే ఆసక్తికరంగా మారింది. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య రెండుసార్లు రాజ్యసభకు వెళ్లాలని ఆశపడ్డారు. పార్టీ అధిష్టానం కూడా ఆయన పేరును పరిశీలించింది.. కానీ చివరి నిమిషంలో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఆయన్ను గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో స్థానానికి రాయలసీమకు చెందిన మరో నేత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆయన కూడా రాజ్యసభ ఎంపీ పదవి కోసం ప్రయత్నాలు చేశారు.. కానీ అవకాశం దక్కలేదు. అందుకే ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయనకు ఛాన్స్ రాకపోతే రాయలసీమకు చెందిన బీసీ నేతల్లో ఒకరికి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.వీరిద్దరు మాత్రమే కాదు.. ఎన్నికల తర్వాత నుంచి ఎమ్మెల్సీ పదవుల రేసులో మరికొందరు నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మ, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు కూడా పదువులు ఆశిస్తున్నారు. వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని రెండేళ్లుగా ప్రచారం జరుగుతోంది.. కానీ ఆయనకు ఇప్పటి వరకు పదవి దక్కలేదు. వంగవీటి రాధాకు గవర్నర్ నామినేటెడ్ కోటాలో పదవి వస్తుందని కొంతమంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్‌లు గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కలేదు.. దీంతో వీరు కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందన్నది చూడాలి.