మార్కాపురం జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం జరిగింది. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గిద్దలూరు పట్టణం నల్లబండ బజారుకు చెందిన అంకాలు, అలకనంద దంపతులు.. నాగేశ్‌, నాగలక్ష్మిలు కంభంలో జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఈ నలుగురు వివాహం జరుగుతున్న కంభంలోని మెయిన్ రోడ్డులో ఉన్న వినాయకస్వామి ఆలయానికి బంధువులతో కలిసి ఆటోలో వెళ్లారు. ఆలయం దగ్గరకు వెళ్లగానే కొందరు ఆటోలో నుంచి దిగి పక్కన నిలబడ్డారు.. అంకాలు, అలకనంద దంపతులు.. నాగేశ్‌, నాగలక్ష్మిలు మాత్రం కిందకు దిగకుండా ఆటోలోనే కూర్చుకున్నారు.కంభంలోని ఆలయం దగ్గర ఆటోను లారీ అతి వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న అంకాలు, అలకనంద, నాగేశ్‌ అక్కడికక్కడే చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న నాలుగేళ్ల చిన్నారి నాగలక్ష్మిని కంభం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తీసుకువెళ్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో సంజీవరాయుడు, వీరయ్య, ఓలమ్మలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పెళ్లికుమార్తె వీరక్క సహా మరో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై కంభం పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన నలుగురు పెళ్లి కుమార్తె వీరక్క తరఫు బంధువులు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి తెలంగాణలోని వైరాకు కొబ్బరి పొట్టు ఎరువు లోడుతో వెళుతోంది. అప్పటి వరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఇంట ఈ రోడ్డు ప్రమాదంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.