నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ

Wait 5 sec.

: తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాలలో దాదాపు 7 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా జీవోలు జారీ కాగా.. మిగిలిన 2 వేల పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు కూడా మరో రెండు రోజుల్లో వెలువడనున్నాయి. ఆర్థిక శాఖ అనుమతులు లభించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో , అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి సడలింపు, కొత్త నోటిఫికేషన్ల జారీపై అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అటు బోర్డు అధికారులు కూడా నోటిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా నిర్వహించేందుకు విధివిధానాలను ఖరారు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థుల అర్హతలు, సిలబస్, పరీక్షల నిర్వహణ తేదీలతో కూడిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖలో నోటిఫికేషన్ రావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. స్వరాష్ట్రంలో తొలిసారిగా 2015 చివరి రోజున 9,281 పోస్టుల భర్తీకి తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ తర్వాత 2018లో రికార్డు స్థాయిలో 1,217 ఎస్సై పోస్టులు, 16,285 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఆ తర్వాత మూడో విడతగా 2022లో 554 ఎస్సై పోస్టులు, 15,644 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చి నియామకాలు పూర్తి చేశారు.ప్రస్తుతం ఇవ్వనున్న నాలుగో నోటిఫికేషన్ ద్వారా పోలీస్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు కేటాయించే రిజర్వేషన్లు, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో ఆధునీకరణకు అనుగుణంగా అదనపు సిబ్బంది నియామకం ఈ విడతలో ప్రాధాన్యత సంతరించుకోనుంది. నోటిఫికేషన్ వెలువడడమే తరువాయిగా అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలలో తమ ప్రిపరేషన్‌ను ముమ్మరం చేశారు.