22k Gold Price: బంగారం, భారీగా తగ్గుతున్నాయి కదా ఇప్పుడు కొందాం అనుకునే వారికి మళ్లీ షాక్ తగులుతోంది. ఈ 2 రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇన్ని రోజులు తగ్గిందనుకుంటే ఒక్కసారిగా అదే రీతిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. . దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు పుంజుకున్నాయి. కొద్ది రోజుల కిందట పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడాయిల్ ధరలు పెరగ్గా బంగారం ధర తగ్గింది. తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలతో బంగారం ఆకర్షణ కోల్పోయి ధర దిగొచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ అంచనాలు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో డాలర్ పడిపోతోంది. ఇదే బంగారానికి ఊతం ఇస్తోంది. ధర పెరుగుతోంది.అసలేమైందంటే తాజాగా యూఎస్ నాన్ ఫామ్ పేరోల్స్ డేటా విడుదలైంది. అమెరికాలో జూన్ నెలలో ఊహించిన దాని కంటే తక్కువ స్థాయిలో ఉద్యోగాల వృద్ధి నమోదైంది. 1.10 లక్షల కొత్త ఉద్యోగాల్ని అంచనా వేస్తే ఇది 57 వేలకే పరిమితమైంది. దీంతో బలహీనమైన జాబ్స్ డేటా కారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తగ్గిపోయాయి. డేటా విడుదలకు ముందు వడ్డీ రేట్ల పెంపునకు అవకాశాలు 66 శాతంగా ఉండగా ఇప్పుడు అది 54 శాతానికి పడిపోయింది. ఇదే నేపథ్యంలో యూఎస్ డాలర్ కూడా పడిపోయింది. దీంతో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు మళ్లీ బంగారంపైకి పెట్టుబడులు చేరాయి. ధరలు పుంజుకుంటున్నాయి. దీంతో 2 రోజుల వ్యవధిలో భారీగా ఎగబాకింది.దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో జులై 4న (శనివారం) ఉదయం 7 గంటల సమయంలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2950 పెరిగి 10 గ్రాములకు రూ. 1,34,750 వద్ద ఉంది. ముందటి రోజు కూడా రూ. 2750 పెరిగింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 3220 పెరగడంతో తులం ప్రస్తుతం రూ. 1,47,000 కు చేరింది. ఇక ముందటి రోజు ఇది 3 వేలు పెరిగింది. ఇలా 2 రోజుల్లో ఏకంగా రూ. 6,220 పెరగడం గమనార్హం. ఇక వెండి ధరలు చూస్తే మరో రూ. 10 వేలు పెరిగి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీకి రూ. 2.60 లక్షలకు చేరింది. ముందటి రోజు ఇది రూ. 5 వేలు ఎగబాకింది.ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే ఇక్కడ కూడా భారీగానే పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3 రోజుల కిందట 4 వేల డాలర్ల దిగువన ఉండగా ఇప్పుడు అది 4174 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సిల్వర్ రేటు చూస్తే 62.42 డాలర్లుగా ఉంది. ఇక డాలరుతో చూస్తే రూపాయి విలువ రూ. 95.25 వద్ద ఉంది.గమనిక: కొనుగోలుదారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. ఈ ధరలు జులై 4 ఉదయం 7 గంటల సమయంలోనివి. ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉదయం 10 గంటల తర్వాత మళ్లీ రిటైల్ ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. గమనించగలరు.