ఏపీలో అక్కడ కొత్తగా మోడ్రన్ ఆర్టీసీ బస్టాండ్ .. రూ.81 కోట్లతో నిర్మాణం, రెండు రాష్ట్రాలకు సరిహద్దులో

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా బస్టాండ్‌లు, బస్ టెర్మినల్స్, బస్ డిపోల నిర్మాణంపై దృష్టిపెట్టారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో మోడల్‌ బస్టాండ్‌ నిర్మాణానికి ముందడుగు పడింది. కుప్పంలో బస్టాండ్ నిర్మాణానికి రూ.81.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు రాగా ముఖ్యమంత్రి చంద్రబాబు బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.చిత్తూరు జిల్లా కలెక్టర్‌ స్వర్ణ కుప్పం విజన్‌-2029లో భాగంగా మోడల్‌ బస్‌స్టేషన్, డిపోల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆర్టీసీ ఎండీ కుప్పంలో మోడల్‌ బస్‌ స్టేషన్‌ నిర్మాణానికి రూ.81.20 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ వెంటనే నిధులు మంజూరు చేయాలని తాజాగా రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. .సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అటు కర్ణాటక, ఇటు తమిళనాడుకు సరిహద్దులో ఉంది. నిత్యం ప్రయాణికులు కుప్పం నియోజకవర్గం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే కుప్పం బస్టాండ్‌ను ఆధునీకరించాలని నిర్ణయించారు.. అక్కడ ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారు. కొత్త మోడల్ బస్టాండ్‌లో షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, ఆధునిక టాయిలెట్లు వంటివి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లను ఆధునీకరించాలని అధికారులకు సూచించారు. ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు వీలుగా ఛార్జింగ్ సౌకర్యం కూడా కల్పించాలని సూచించారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు కూడా ఏర్పాటు చేయాలన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అవసరమైన చోట కొత్త బస్టాండ్‌ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపగా.. ఏపీ ప్రభుత్వం అవసరమైన వాటికి అనుమతులు ఇస్తోంది. తిరుపతిలో కూడా అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. తిరుమలకు వచ్చే భక్తులతో కొంతకాలంగా తిరుపతి బస్టాండ్‌‌లో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. తిరుపతి బస్టాండ్‌లో హెలిప్యాడ్, రోప్ వే, షాపింగ్ కాంప్లెక్స్‌లు కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కొత్తగా నిర్మించబోయే ఈ బస్టాండ్ పూర్తైతే లక్ష మంది యాత్రికులు రాకపోకలు సాగించవచ్చని చెబుతున్నారు.