Bank : స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా రూపాయి కూడా నష్టం వచ్చే ఛాన్స్ లేని సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ బెస్ట్ ఛాయిస్. ఇక బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరిస్తుంటాయి. గతంలో ఆర్బీఐ రెపో రేటు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా అధిక వడ్డీ వచ్చింది. తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కొద్దీ బ్యాంక్ డిపాజిట్లు కూడా ఆకర్షణ కోల్పోతూ వచ్చాయన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు చారిత్రక కనిష్ఠాలకు పడిపోయాయి. అయినప్పటికీ సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు దాదాపు 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇంకా ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మూడేళ్ల కాల వ్యవధికి ఎఫ్‌డీ చేస్తే ఏ బ్యాంకులో వడ్డీ ఎక్కువ వస్తుంది. రూ. 5 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వడ్డీ వస్తుందనేది చూద్దాం. అన్నింటికంటే ఎక్కువగా సీనియర్ సిటిజెన్లకు మూడేళ్ల కాలానికి జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 8.3 శాతంగా వడ్డీ రేటు ఉంది. ఇక్కడ 5 లక్షలు డిపాజిట్ చేసిన వారికి రూ. 1,39,739 వడ్డీ వస్తుంది. మొత్తం చేతికి రూ. 6,39,739 వస్తుంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో చూస్తే ఇదే మూడేళ్ల కాలానికి 8 శాతంగా వడ్డీ రేటు ఉంది. ఇక్కడ 5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే రూ. 1,34,121 వడ్డీ వస్తుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 7.90 శాతంగా వడ్డీ రేటు ఉంది. ఇందులో 5 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి రూ. 1,32,258 వడ్డీ వస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 7.75 శాతంగా వడ్డీ రేటు ఉంది. ఇక్కడ 5 లక్షలు జమ చేస్తే రూ. 1,29,474 వడ్డీ వస్తుంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు ప్రస్తుతం 7.60 శాతంగా ఉండగా 5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి రూ. 1,26,701 వడ్డీ అందుతుంది. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు 7.50 శాతంగా ఉండగా ఇక్కడ 5 లక్షలు జమ చేస్తే మూడేళ్లకు రూ. 1,24,858 వడ్డీ వస్తుంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 7.40 శాతంగా వడ్డీ రేటు ఉండగా ఇక్కడ 5 లక్షలు డిపాజిట్ చేసిన వారికి రూ. 1,23,021 వస్తుంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంటే 5 లక్షల ఎఫ్‌డీపై మూడేళ్లకు రూ. 1,06,704 వడ్డీ అందుతుంది.