గోదావరి జిల్లాల ప్రజలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ వినిపించింది. విశాఖపట్నం – ముంబయి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు నిడదవోలులో హాల్ట్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎంపీ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తన అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం - ముంబయి లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు(18519/18520) నిడదవోలు రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరు చేయడంపై పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో గోదావరి జిల్లాల ప్రజలకు దేశ ఆర్థిక రాజధాని ముంబయితో మరింత మెరుగైన రైల్వే అనుసంధానం లభిస్తుందని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో కేంద్ర రైల్వే మంత్రిని కలిశారు దగ్గుబాటి పురందేశ్వరి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు రైల్వే స్టేషన్‌లో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. విజయవాడ–విశాఖ, విజయవాడ– నర్సాపురం మార్గాలను అనుసంధానించే రైల్వే జంక్షన్‌గా నిడదవోలు ఉందని రైల్వే మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో నిడదవోలులో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ , కోకనాడ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిడదవోలు రైల్వే స్టేషన్‌లో హాల్ట్ సౌకర్యం కల్పించాలని కోరారు. హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.నిడదవోలు నుంచి ముంబయికి వెళ్లే వ్యాపారులు, కూలీలు, ఉద్యోగులతో పాటు విజయవాడ, మంగళగిరి, ద్వారకా తిరుమలవంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే పర్యాటకులు ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం వేరే స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం, ఈ మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిడదవోలు రైల్వేస్టేషన్‌లో ఆపేందుకు కేవలం నాలుగు నిమిషాలు అదనపు సమయం పడుతుందని పేర్కొన్నారు. దీంతో ఇతర రైళ్ల రాకపోకలకు ఆటంకం ఉండదని, రైల్వేకు అదనపు ఆదాయం కూడా వస్తుందని వివరించారు. ఈ క్రమంలోనే నిడదవోలులో విశాఖ లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలుకు రైల్వేశాఖ హాల్ట్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.