Venezuela: భూకంపం తర్వాత ఒక్కడి ప్రాణాలు కోసం 8 దేశాలు.. 100 గంటల ఆపరేషన్

Wait 5 sec.

గత నెల సంభవించిన శిథిలాల కింద 43 ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాన్ ఆల్బెర్టో గిల్ ఫ్లోర్స్ ఎనిమిది రోజుల పాటు చిక్కుకుపోయి, తాను బ్రతుకుతాడో లేదో తెలియని అనిశ్చితిలో ఉన్నాడు. చివరకు సహాయక సిబ్బంది అతని వద్దకు చేరుకున్నప్పుడు, అతను చేసిన మొదటి అభ్యర్థన హృదయాలను కదిలిస్తోంది. ‘ఒకవేళ తాను ప్రాణాలతో లేకపోతే ఆమె బతకలేదు.. కాబట్టి తాను బ్రతికే ఉన్న విషయం తన భార్యకు చెప్పవద్దు’ అతడు కోరాడు. గురువారం తెల్లవారుజామున గిల్ ఫ్లోర్స్ దుమ్ముతో నిండిన శరీరంతో స్ట్రెచర్‌పై పడుకుని, హెల్మెట్లు ధరించిన రక్షక సిబ్బంది మధ్య శిథిలాల నుంచి బయటకు వచ్చాడు. వెనిజులా వ్యాప్తంగా 2,200 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న వినాశకరమైన భూకంపం తర్వాత, ఆయన ప్రాణాలతో బయటపడటం గొప్ప ఆశారేఖను నింపింది. స్థానిక కాలమానం ప్రకారం సంభవించినప్పుడు లా గువైరా రాష్ట్రంలోని కాటియా లా మార్‌లో ఉన్న గలేరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ సెంటర్‌లోని తన చిన్న సెక్యూరిటీ క్యాబిన్‌లో రాత్రి షిఫ్ట్‌లో గిల్ ఫ్లోర్స్ ఉన్నాడు. వరుసగా సంభవించిన ఈ భూకంపాలతో ఏడు అంతస్తుల భవనం కూలిపోయింది. అతడి చుట్టూ ఉన్న కాంక్రీట్ నిర్మాణం కూలిపోతున్నప్పటికీ, సెక్యూరిటీ క్యాబిన్ చెక్కుచెదరలేదు. అదే అతడ్ని శిథిలాల నుంచి కాపాడి, ఒక చిన్న గాలి బుడగను సృష్టించి, ప్రాణాలతో ఉండటానికి సహాయపడింది. కొన్ని రోజుల పాటు, అతను బతికి ఉన్నాడో లేదో అతని కుటుంబానికి తెలియలేదుకోస్టారికన్ రెడ్ క్రాస్‌కు చెందిన ఒక ప్రత్యేక బృందం ఆదివారం నాడు అతడు ప్రాణాలతో ఉన్నట్టు మొదటసారి గుర్తించింది. రెస్క్యూ బృందాలు తన భర్త సజీవంగా ఉన్నట్టు గుర్తించడానికి ముందు తాను తీవ్ర నిరాశకు లోనయ్యానని భార్య గుస్బిమార్ గొంజాలెజ్ చెప్పారు. ‘ఆయన బతికే ఉన్నాడని తెలిసినప్పుడు, ఆ చీకటిలో నాకు ఒక ఆశాకిరణం కనిపించింది’ అని ఆమె అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. ఈ దంపతులకు ఎనిమిది, పదేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.రెస్యూ టీమ్‌లు గిల్ ఫ్లోర్స్‌ను కనుగొన్నప్పుడు అతడు చెప్పిన మాటలను కోస్టారికన్ రెడ్ క్రాస్ సిబ్బంది మిన్యార్ కొల్లాడో గుర్తుచేసుకున్నారు. ‘‘మేము అతడ్ని కనుగొన్నప్పుడు, ఒకవేళ తాను బ్రతకలేనేమోనని, తాను బతికే ఉన్నానని తన భార్యకు చెప్పవద్దని మమ్మల్ని కోరాడు.. కానీ, మేము అతడ్ని ఇక్కడ ఎప్పటికీ వదిలే ప్రసక్తేలేదని చెప్పాం’’ అన్నారు.ఈ రెస్క్యూ ఆపరేషన్ ఒక అంతర్జాతీయ ప్రయత్నంగా మారింది. ఈ మిషన్‌ను చిలీకి చెందిన అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ సమన్వయం చేసింది. అమెరికా, పోర్చుగల్, మెక్సికో, కోస్టారికా, ఎల్ సాల్వడార్, వెనిజులాకు చెందిన ప్రత్యేక బృందాలతో కలిసి వీరు పనిచేశారు. శిథిలాల కింద చిక్కుకున్న సెక్యూరిటీ గార్డును చేరుకోవడానికి అత్యంత ప్రమాదకరంగా మారిన శిథిలాలు, కుండపోత వర్షం, వరుస భూప్రకంపనలను ఎదుర్కొంటూ 100 గంటలకు పైగా శ్రమించారు.శిథిలాల్లోకి ఒక టెలిస్కోపిక్ కెమెరాను పంపి గిల్ ఫ్లోర్స్‌తో నిరంతరం సంప్రదింపులు జరపగలిగారు. అతడి ప్రాణాలు నిలపడానికి ఒక ఇరుకైన మార్గం నుంచి పైపు ద్వారా నీరు, ద్రవ పోషకాలను పంపించారు. ఆపరేషన్ చివరి మూడు రోజులలో డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడానికి 10 లీటర్లకు పైగా నీరు, ద్రవ పోషకాలను అతడికి అందించారు.రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకున్నప్పుడు 30 సిబ్బంది బిల్డింగ్ పార్కింగ్ ఏరియాలో శిథిలాలను తొలగించారు. ఇద్దరు జాగ్రత్తంగా మూడు మీటర్ల సొరంగం తవ్వి అతడి వద్దకు చేరుకున్నారు. ఈ ఆపరేషన్ జరుగుతున్నంత సేపూ చిలీకి చెందిన సీనియర్ ఫైర్‌ఫైటర్ మరియా పాజ్ కాంపోస్ గిల్.. ఫ్లోరెస్‌తో మాట్లాడుతూ ఆయనలో ధైర్యాన్ని నింపారు.చిలీ అగ్నిమాపక సిబ్బంది విడుదల చేసిన వీడియోలో.. గిల్ ఫ్లోర్స్ భూగర్భంలో బొమ్మలు గీస్తూ కనిపించాడు. ‘‘పై నుంచి పడే చిన్న చిన్న రేణువులు మీ కళ్లలోకి వెళ్లకుండా ఉండేందుకు, మీరు కళ్లద్దాలు పెట్టుకుని ఉండండి’ అని ఆమె అతనికి చెప్పింది. మూడు రోజులకుపైగా ముమ్మర తవ్వకాలు, ఎనిమిది రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చివరకు గిల్ ఫ్లోర్స్ వద్దకు రెస్క్యూ టీమ్‌లు చేరుకున్నాయి. అతడిని శిథిలాల నుంచి బయటకు తీసుకువస్తుండగా వివిధ దేశాల జెండాలు పట్టుకున్న బృందాలు ఆనందంతో కేకలు వేశాయి.సాధారణంగా భారీ విపత్తులు సంభవించినప్పుడు బాధితులు 48 నుంచి 72 గంటల వరకు మాత్రమే ప్రాణాలతో ఉండే అవకాశం ఉంది. కానీ, అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు అతడికి నిరంతరం ఆహారం, నీరు అందిస్తూ.. నిరంతరం సంభాషిస్తూ జాగ్రత్తగా కాంక్రీటు శిథిలాలను తొలగించడం ద్వారా ఎనిమిది రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు తీశారు.