మొన్ననే వార్నింగ్.. నేడు యాక్షన్‌లోకి.. డిప్యూటీ సీఎం సూపర్ స్పీడ్..

Wait 5 sec.

సోషల్ మీడియా దుర్వినియోగం.. ఇటీవలే ఈ అంశం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం . హెచ్చరించారు. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కులని.. అయితే వాటికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇదే క్రమంలోనే సోషల్ మీడియా దుర్వినియోగం ద్వారా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా ఉంటామని ప్రకటించారు. అలాంటివారు ఫిర్యాదు చేసేందుకు వీలుగా డిప్యూటీ సీఎంవోలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ శుక్రవారం రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి.. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ టీమ్ తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ వార్షిక నివేదికలో వివరించారు. అలాగే సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టే వ్యక్తులపై.. సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించారు.మరోవైపు ఏపీ సైబర్ క్రైమ్ విభాగం ద్వారా సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే శక్తులను సైతం అణిచి వేయాలని ఆలోచిస్తున్నారు. వీటితో పాటుగా సోషల్ మీడియా దుర్వినియోగం ద్వారా బాధితులుగా మారిన వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా సైబర్ క్రైమ్ ఐజీతో పవన్ కళ్యాణ్ భేటీ కావటంతో.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దిశగా అడుగులు పడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.