కడప స్టీల్ ప్లాంట్: నాలుగుసార్లు శంకుస్థాపనలు.. ఈసారి పనులు ప్రారంభం.. ఇదీ హిస్టరీ..!

Wait 5 sec.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడప స్టీల్‌ ప్లాంట్ పనులను జులై 3న ప్రారంభించారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అనేది దశాబ్దాలుగా జిల్లా వాసులకు నెరవేరని కలగా మారింది. ఇప్పటికే నాలుగుసార్లు శంకుస్థాపనలు జరిగినప్పటికీ పనులు మాత్రం పట్టాలు ఎక్కలేదు. ఈసారి మాత్రం తొలి దశను 2028 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.శంకుస్థాపనలు ఇలా..2007 జూన్ 10న బ్రాహ్మణి ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్‌కు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. 10,670 ఎకరాల భూములను కేటాయించారు. అయితే పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను సెయిల్ పరిశీలించింది. దాని రిపోర్టు ఆధారంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్రం చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడుతుందని నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో 2018 డిసెంబర్ 27న స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కడప జిల్లా మైలవరం మండలంలోని కంబాలదిన్నెలో 3295 ఎకరాలు కేటాయించారు.2019లో ఏపీలో ప్రభుత్వం మారింది. అదే ఏడాది డిసెంబర్ 27న ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరిట జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్ల పల్లెలో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. భాగస్వామ్యాలు ముందుకు సాగకపోవడంతో 2023 ఫిబ్రవరి 15న సున్నపురాళ్ల పల్లెలోనే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వైఎస్ జగన్ మరోసారి భూమి పూజ చేశారు.కేటాయింపులు ఇలా..కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఈసారి కూడా సున్నపురాళ్ల పల్లెలోనే 1130 ఎకరాలను కేటాయించారు. రూ. 16,350 కోట్ల ఖర్చుతో రెండు దశల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని సామర్థ్యం 2 మిలియన్ మెట్రిక్ టన్నులు. వచ్చే రెండేళ్లలో తొలి దశ పూర్తి కానుందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇక్కడ తయారయ్యే స్టీల్‌ను ఎత్తయిన భవనాలు, హై బీమ్స్ తయారీకి ఉపయోగిస్తారు. దీనికి అనుబంధంగా రూ. 2400 కోట్లతో సౌర, పవన విద్యు్త్ ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ వల్ల 2500 మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.స్టీల్ ప్లాంట్‌కు అనుసంధానంగా ఎంఎస్ఎంఈ పార్కు రానుందని కడప కలెక్టర్ తెలిపారు. దీని వల్ల మరో రూ. 2500 కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ కోసం 8 కి. మీ. రోడ్డు నిర్మాణానికి రివైజ్డ్ టెండర్లు పిలిచారు. గండికోట జలాశయం నుంచి 2 టీఎంసీల నీటిని అందించనున్నారు. జమ్మలమడుగు నుంచి ప్లాంట్‌కు 12 కి. మీ. దూరం రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని సర్వే పూర్తయ్యింది. ప్లాంట్ కోసం 400 కేవీ విద్యుత్ అవసరం. దానికి సంబంధించిన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎకో ఫ్రెండ్లీ స్టీల్ ప్లాంట్. బార్స్, ఈఆర్సీ సిస్టమ్‌లో ప్రొడ్యూస్ చేస్తారు. దీని వల్ల కాలుష్యం ఎక్కువగా ఉండదు. విద్యుత్‌ను సైతం సోలార్, విండ్ ద్వారా ఉత్పత్తి చేస్తారు. కాబట్టి కాలుష్యం చాలా తక్కువగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు ముడి ఇనుప ఖనిజం కావాలి. కానీ కడపలో నిర్మిస్తున్నది స్క్రాప్‌ను హైగ్రేడ్ స్టీల్‌ బీమ్‌గా తయారు చేసే ప్రాజెక్ట్. ప్రస్తుతం మార్కెట్లో దీనికి అధిక డిమాండ్ ఉంది. మనం ప్రస్తుతం విదేశాల నుంచి ఈ స్టీల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం.