AU SFB Suhana Safar: ప్రస్తుత రోజుల్లో తమకంటూ ఒక ఇల్లు, అందులో ఓ కారు ఉండాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నారు. అయితే, పెరుగుతున్న ధరలను చూసి తన కలను వాయిదా వేసుకుంటున్నాడు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో తమ ఫ్యామిలీ కోసం ఒక చిన్న కారు ఉండాలని కోరుకునే వారు ఎక్కువే. కానీ, డౌన్ పేమెంట్, నెలవారీ ఈఎంఐ వాయిదాల గురించి ఆలోచించి వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారందరికీ కొత్త కార్లు కొనిచ్చే సరికొత్త స్కీమ్ లాంచ్ చేసింది ప్రముఖ బ్యాంక్ అయిన ఇందుకోసం మారుతీ సుజుకీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. దేశంలోని అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనివర్సల్ బ్యాంకుగా మారేందుకు అనుమతి పొందిన సంస్థగా ఇప్పుడు మారుతీ సుజుకీ ఇండియా తో కలిసి ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే సుహానా సఫర్ (Suhana Safar). మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి, అది కూడా ఆల్టో కే10, ఎస్- ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్ వంటి పాపులర్ మోడళ్లను సులభంగా సొంతం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అందుకోసం కారు కొనాలనుకునే వారు చేయాల్సిన పని ఒకటి ఉంది. సుహానా సఫర్ స్కీమ్ ద్వారా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ముందుగా రికరింగ్ డిపాజిట్ పథకం (Recurring Deposit Scheme) అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తొలిసారి కారు కొనేవారు ఎదుర్కొనే ప్రధాన సమస్య డౌన్ పేమెంట్, ఆ తర్వాత వచ్చే నెలవారీ వాయిదాల భారం. వీటికి ఆర్థికంగా సిద్ధంగా లేకపోవడం వల్ల చాలా మంది కారు కొనాలనే కలను వాయిదా వేసుకుంటున్నారు. ఆ సమస్యకు ఈ సుహానా సఫరా ఆర్‌డీ ఒక పరిష్కారమని బ్యాంక్ తెలిపింది. కొనాలనుకునే కారుకు భవిష్యత్తులో కట్టబోయే ఈఎంఐకి సమానమైన మొత్తం, మూడు నుంచి ఆరు నెలల పాటు ప్రతి నెలా రికరింగ్ డిపాజిట్ ఖాతాలో జమ చేయాలి. ఈ కాలంలో మీరు జమ చేసే మొత్తంపై బ్యాంక్ వడ్డీ చెల్లిస్తుంది. ఆర్‌డీ మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ మొత్తాన్ని కారు కొనేందుకు డౌన్ పేమెంట్ గా వాడుకోవచ్చు. ఆ తర్వాత బ్యాంక్ మీకు ఎలాంటి అదనపు తనిఖీలు లేకుండానే కారు లోన్ మంజూరు చేస్తుంది. నెల నెలా ఈఎంఐ కట్టడం సైతం మీకు చాలా సులభమవుతుంది. ఆర్‌డీ ఖాతాలో ఇంకా ఏదైనా సొమ్ము ఉంటే దానిపైనా వడ్డీ వస్తుంది. కారు లోన్ ఇచ్చే ముందు బ్యాంక్ మీ ఆర్థిక సామర్థ్యాన్ని ప్రత్యేకంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో మీ కలల కారును ఇంటికి తెచ్చుకోవచ్చు.