టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు సంబంధించిన జూబ్లీహిల్స్ ఆస్తి వేలం వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. రుణ వసూళ్ల ప్రక్రియలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిపిన ఈ వేలాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బ్యాంక్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.నాకు అన్యాయం జరిగింది: బండ్ల గణేష్ఈ వివాదంపై బండ్ల గణేష్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన ఆస్తిని బ్యాంక్ అధికారులు అన్యాయంగా విక్రయించారని ఆరోపించారు. "కొందరు బ్యాంక్ అధికారులు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని, నా ఆస్తిని మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకు విక్రయించి నాకు తీవ్ర అన్యాయం చేశారు. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా నేను 2022లోనే న్యాయపోరాటం ప్రారంభించాను. ఆ సమయంలో డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ (DRT)లో నాకు అనుకూలంగానే ఆర్డర్ వచ్చింది. అయితే తాజాగా హైకోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు రావడం బాధాకరం. అయినప్పటికీ నాకు భారత న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నా హక్కుల రక్షణ కోసం, న్యాయం సాధించడం కోసం త్వరలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను" అని ఆయన స్పష్టం చేశారు. వివాదానికి దారితీసిన నేపథ్యం ఇదేశ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తీసుకున్న భారీ రుణానికి బండ్ల గణేష్‌తో పాటు ఆయన తండ్రి, సోదరుడు వ్యక్తిగత గ్యారంటర్లుగా (హామీదారులుగా) సంతకాలు చేశారు. అయితే సదరు సంస్థ సకాలంలో అప్పు తీర్చడంలో విఫలం కావడంతో బ్యాంక్ రికవరీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 2019లో సర్ఫేసి (SARFAESI) చట్టం కింద జూబ్లీహిల్స్‌లోని వారి నివాస స్థిరాస్తిని బ్యాంక్ తన స్వాధీనంలోకి తీసుకుంది. అనంతరం 2022లో జరిపిన బహిరంగ వేలంలో ఈ 500 గజాల ప్రాపర్టీ సుమారు రూ.8.51 కోట్లకు విక్రయించబడింది. హైకోర్టు విచారణలో యూనియన్ బ్యాంక్ తరఫు న్యాయవాదులు గట్టి వాదనలు వినిపించారు. వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత బండ్ల గణేష్ కుటుంబం వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కింద వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ముందుకు వచ్చిందని కోర్టుకు తెలిపారు. మొత్తం రూ.82 కోట్ల ఓటీఎస్‌ మొత్తంలో, వేలం ద్వారా వచ్చిన రూ.8.51 కోట్లను మినహాయించుకోవడానికి బ్యాంకు కూడా అంగీకరించిందన్నారు. అయితే ఈ డీల్‌కు ఒప్పుకున్న బండ్ల గణేష్ బృందం, కోర్టుల్లో ఉన్న పాత పిటిషన్లను వెనక్కి తీసుకుంటామని మాట ఇచ్చి తప్పారని, చట్ట విరుద్ధంగా డీఆర్‌టీని ఆశ్రయించారని పేర్కొన్నారు. మరోవైపు కంపెనీపై ఎన్‌సీఎల్‌టీ (NCLT)లో దివాలా పరిష్కార ప్రక్రియ నడుస్తున్నందున ఆస్తుల అమ్మకాలపై నిషేధం ఉంటుందన్న బండ్ల గణేష్ లాయర్ల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం వేలం వేసింది కంపెనీ ఆస్తిని కాదని, వ్యక్తిగత హామీదారుల సొంత ఆస్తిని అని, కాబట్టి దీనికి మొరటోరియం వర్తించదని స్పష్టం చేస్తూ బ్యాంక్ వేలాన్ని సమర్థించింది. హైకోర్టులో గట్టి షాక్ తగిలినప్పటికీ, బండ్ల గణేష్ మాత్రం సుప్రీంకోర్టులో తేల్చుకుంటానని ప్రకటించడం గమనార్హం.