జిమ్ లవర్స్‌కు బిగ్ అలర్ట్.. ఇవి వాడుతున్నారా.. మీ లైంగిక సామర్థ్యం, ప్రాణాలకు ముప్పే..!

Wait 5 sec.

తొందరగా బాడీ బిల్డ్ కావాలనే ఆశ.. సిక్స్‌ప్యాక్ రావాలనే ఆరాటం.. యువతను ప్రాణాంతకమైన ఉచ్చులోకి నెడుతోంది. హైదరాబాద్‌లో జిమ్‌లకు వచ్చే యువతను టార్గెట్‌గా చేసుకుని ఓ ముఠా భారీగా సంపాదిస్తోంది. అక్రమంగా స్టెరాయిడ్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు ట్రైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, మందులు, ఇతర సప్లిమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ ప్రాంతంలోని పలు జిమ్‌లకు వచ్చే యువతకు 3 నుంచి 4 నెలల్లో కండలు తిరిగిన శరీరం తయారవుతుందని.. త్వరగా బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అవుతుంది అంటూ నిందితులు మభ్యపెట్టి ఈ స్టెరాయిడ్లను విక్రయిస్తున్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా ఉన్న బట్టే శివాకు గతంలో సొంత జిమ్ ఉండేదని.. అది మూతపడిన తర్వాత వివిధ జిమ్‌లలో ట్రైనర్‌గా పనిచేస్తూ ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు.ఇక ఈ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే స్టెరాయిడ్లను ఆన్‌లైన్ ద్వారా తెప్పిస్తున్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నకిలీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు సృష్టించి ఈ మందులను చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ సరఫరా వెనుక ఉన్న ప్రధాన డీలర్లను కూడా గుర్తించామని.. వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు.డాక్టర్ సలహా లేకుండా అనాబాలిక్, ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లను వాడడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా లైంగిక సామర్థ్యం తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక వంధ్యత్వం, మానసిక సమస్యలు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాలేయం దెబ్బతినడం, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఆకస్మిక గుండెపోటుకు కూడా దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.స్టెరాయిడ్లతో పాటు అధిక ప్రోటీన్ ఆహారం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉంటే గుండెలో బ్లాకేజీలు ఏర్పడి ప్రాణాపాయం సంభవించే అవకాశం మరింత పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. సంపాదన కోసం యువత ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పష్టం చేశారు. జిమ్‌కు వెళ్లే యువత ఎలాంటి స్టెరాయిడ్లు, హార్మోన్ ఇంజెక్షన్లు లేదా ప్రత్యేక సప్లిమెంట్లనైనా అర్హత కలిగిన వైద్యుల సలహాతో మాత్రమే ఉపయోగించాలని, ట్రైనర్ల మాటలు నమ్మి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయొద్దని పోలీసులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.