వలస కార్మికుల పిల్లల కోసం తెలంగాణ సర్కార్ గొప్ప నిర్ణయం.. హైదరాబాద్‌లో వర్క్ సైట్ స్కూల్స్

Wait 5 sec.

దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం, పొట్టకూటి కోసం.. చాలా మంది వలస కార్మికులు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే కార్మికుల కుటుంబాలకు పిల్లల చదువు పెద్ద సమస్యగా మారుతోంది. నిర్మాణ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే కార్మికుల పిల్లలు తరచూ పాఠశాలలకు దూరం అవుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాల వద్దే వర్క్ సైట్ స్కూళ్లు ఏర్పాటు చేసి చిన్నారులకు విద్యతో పాటు భద్రత కల్పించే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఇందులో భాగంగా దేశంలోనే తొలి వర్క్ సైట్ స్కూల్‌ను మే 3వ తేదీన నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంపులో ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. శ్రీజన ఈ పాఠశాలను ప్రారంభించారు. విద్యాశాఖ, పురపాలక శాఖ, రాజపుష్ప ప్రాపర్టీస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలలో 37 మంది చిన్నారులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చదువుకుంటున్నారు. మొత్తం 53 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వీరిలో ఎక్కువ మంది బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల పిల్లలే ఉన్నారు. ఈ వర్క్ సైట్ స్కూళ్లలో ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ బోధించడంతో పాటు ఆటలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం, విరామ సమయాలను కూడా పాఠశాల నిర్వహణలో భాగంగా కల్పిస్తున్నారు.నిర్మాణ సైట్ల వద్దే ఈ తరగతులు నిర్వహించడం వల్ల పిల్లలు నిర్లక్ష్యంగా లేబర్ క్యాంపుల్లో తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. తల్లిదండ్రులు పనుల్లో ఉండగా చిన్నారులు సురక్షితంగా పాఠాలు నేర్చుకునే అవకాశం కలిగింది. ఇటీవల లేబర్ కాలనీల్లో చిన్నారులపై జరిగిన నేర ఘటనల నేపథ్యంలో వారి భద్రతకు కూడా ఈ పాఠశాలలు ఒక రక్షణ కవచంగా మారుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఇప్పటికే నార్సింగిలో నవనామి, బీఎస్ఆర్ డెవలపర్స్ నిర్మాణ ప్రాంగణాల్లో మరో 2 వర్క్ సైట్ స్కూళ్లు రెడీగా ఉన్నాయి. భవిష్యత్తులో సైబరాబాద్ పరిధిలోని సుమారు 100 లేబర్ క్యాంపుల్లో ఇలాంటి వర్క్ సైట్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.పిల్లలకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు కొత్త మరుగుదొడ్లు, ప్రత్యేక ఆట స్థలం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి 3 జతల స్కూల్ యూనిఫాంలను కూడా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణ కార్మికులు నగర అభివృద్ధికి ఎంత ముఖ్యమో, వారి పిల్లల విద్య కూడా అంతే ముఖ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం ఇస్తోంది. వలస కార్మికుల పిల్లలు చదువుకు దూరం కాకుండా, సురక్షితమైన వాతావరణంలో మంచి భవిష్యత్తు నిర్మించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమం ద్వారా కల్పిస్తోంది.