ఇరాన్‌తో శాంతి ఒప్పందం‌పై అమెరికా సంతకాలు పెట్టిన తర్వాత యూఎస్ఏ - ఇజ్రాయెల్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అయితే, ఈ గ్యాప్ ఇప్పటిది కాదని, ఏప్రిల్ నెలలోనే ఇరు దేశాల మధ్య విభేదాలు మొదలయ్యాయి అంటూ ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ముఖ్యంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేయాలి అనుకున్న దాడులను అమెరికా అడ్డుకుంటూ వచ్చిందనే కీలక విషయాలు కూడా ఈ నివేదిక బయటపెట్టింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలీబాఫ్‌ను ఇజ్రాయెల్ హత్య చేయొచ్చని అమెరికా ఏప్రిల్‌లోనే టెహ్రాన్‌ను హెచ్చరించింది. ఆ సమయంలో అమెరికాతో జరుగుతున్న అణు చర్చల్లో పాల్గొనేందుకు అరాఘ్చీ, ఘాలీబాఫ్‌ను ఇరాన్ తరఫున ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వారిని టార్గెట్ చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావించినట్లు నివేదిక పేర్కొంది. READ ALSO న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 12న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ నుంచి టెహ్రాన్‌కు తిరిగి వస్తున్న ఘాలిబాఫ్ విమానాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దాడికి సిద్ధమైందని అమెరికా గుర్తించింది. ఇరాన్ గగనతలం మీదుగా ఇరాన్ వైపు వెళ్తున్న రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను గుర్తించి.. వెంటనే అమెరికా ఈ సమాచారాన్ని ఇరాన్‌కు అందించింది. దాంతో ఘాలిబాఫ్ టెహ్రాన్‌కు వెళ్లాల్సిన విమాన మార్గాన్ని మార్చి ఉత్తర ఇరాన్‌లోని మష్హద్ నగరంలో అత్యవసర ల్యాండ్ అయినట్లు పేర్కొంది. ఇరాన్ విషయంలో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య అప్పటి నుంచే విభేదాలు నెలకొన్నాయని భావిస్తున్నారు. అమెరికా - ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం, శాంతి చర్చల విషయంలో కూడా ఇరు దేశాల వైఖరిపై స్పష్టమైన తేడాలు కనిపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని మెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలు కూడా ఇటీవల బహిర్గతమయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. నెతన్యాహూ మరింత బాధ్యతగా వ్యవహరించాలని.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ హెచ్చరించినప్పటికీ ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగిస్తోంది. మొత్తానికి అమెరికా - ఇజ్రాయెల్ సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని అన్న అనుమానాలు ఈ నివేదికతో మరింత బలపడ్డాయి.