ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు, మహబూబ్‌నగర్‌లో DRDO.. రాజ్‌నాథ్‌-రేవంత్ భేటీలో కీలక అంశాలు

Wait 5 sec.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు తెలంగాణ ప్రాజెక్టులు, అంశాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి.. మూసీ సుందరీకరణలో భాగంగా గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను బదిలీ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశం కావడం వల్ల ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌పోర్టుకు సహకరిస్తామని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ఢిల్లీలోని ర‌క్షణ శాఖ కార్యాల‌యం క‌ర్తవ్య భ‌వ‌న్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెర్మినల్‌తోపాటు కార్గో, ఎమ్‌ఆర్‌వో, హ్యాంగర్‌ సౌకర్యాలు కూడా ఆదిలాబాద్‌లో కల్పించాలని తేల్చి చెప్పారు. హ్యాంగర్స్‌ ఏర్పాటుకు ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు అనుకూలంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర సమీపంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ప్రాజెక్ట్ తొందరగా మంజూరు చేయాలని కోరారు.భార‌త వాయుసేన టెర్మిన‌ల్‌తో పాటు ప్రయాణికుల సౌక‌ర్యం కోసం నిర్మించ‌నున్న పౌర విమాన‌యాన శాఖ‌కు చెందిన టెర్మిన‌ల్ బిల్డింగ్‌తో పాటు కార్గో, ఎంఆర్‌వో, హ్యాంగ‌ర్ వంటి సౌక‌ర్యాల‌ను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇటీవ‌లి కాలంలో మ‌ధ్య ఆసియాలో జరుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఎయిర్‌లైన్స్ త‌మ హ్యాంగ‌ర్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు స‌రైన ప్రాంతాల‌ కోసం అన్వేషిస్తున్నాయ‌ని తెలిపారు. హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అత్యంత అనుకూల‌మైన ప్రాంతమని వివరించారు. ఈ క్రమంలోనే ఆ దిశ‌గా అభివృద్ధి చేయాల‌ని రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ఆర్అండ్‌బీ ప్రత్యేక సెక్రట‌రీ వికాస్‌రాజ్‌.. సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ కేఎస్‌ శ్రీ‌నివాస‌రాజు.. ముఖ్యమంత్రి కార్యద‌ర్శి మాణిక్ రాజ్‌.. స్పెష‌ల్ సెక్రట‌రీ కోఆర్డినేష‌న్ అద్వైత్ కుమార్ సింగ్ ఉన్నారు.