25 ఏళ్ల నాటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాం.. బసవతారకం ఆస్పత్రి రజతోత్సవంలో బాలకృష్ణ ఎమోషనల్

Wait 5 sec.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ ఆస్పత్రి ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ సభలో ఆస్పత్రి ఛైర్మన్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే .. ఎమోషనల్ అయ్యారు. పేద రోగులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ ఆస్పత్రిని ప్రారంభం జరిగిందని తెలిపారు. రోజుకు 35 నుంచి 40 క్యాన్సర్ శస్త్రచికిత్సలు బసవతారకం ఆస్పత్రిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. వేలాది మంది క్యాన్సర్ రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ ఆస్పత్రి ఒక ఆశాకిరణం అని పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి రజతోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. కేంద్రమంత్రులు అనుప్రియ పటేల్‌, పెమ్మసాని చంద్రశేఖర్‌.. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు. తాను ఒక నటుడిగానో, ఎమ్మెల్యేగానో కాదని.. ఒక కొడుకుగా ఇవాళ అందరి ముందు నిలుచున్నానని బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి బసవతారకం క్యాన్సర్‌ వ్యాధికి గురైనప్పుడు.. ఎంతో బాధపడ్డామని గుర్తు చేసుకున్నారు. అప్పుడు తమ వద్ద డబ్బు ఉంది కాబట్టి గట్టిగా పోరాడగలిగామని.. అదే డబ్బు లేని నిరుపేదలకు ఈ భయంకరమైన వ్యాధి వస్తే.. వారు ఎలా పోరాటం చేస్తారని తన తల్లి బసవతారకం ప్రశ్నించారని తెలిపారు. అప్పుడే ఈ బసవతారకం ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినట్లు చెప్పారు. 3.75 లక్షల మంది రోగులకు ఔట్ పేషంట్ (ఓపీ) సేవలు అందించామని.. క్యాన్సర్ వ్యాధి వచ్చి బాధతో తమ ఆస్పత్రికి వచ్చే వారు తిరిగి నవ్వుతూ వారి ఇళ్లకు వెళ్లాలి అనేదే తమ ఉద్దేశమని బాలకృష్ణ వెల్లడించారు. ఇక మన దేశంలోనే తొలి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాన్ని అప్పట్లోనే బసవతారకం ఆస్పత్రిలో ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రభుత్వాలు తమ ఆస్పత్రికి ఎంతగానో సహకరించాయని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంస్థలు, ఎంతోమంది దాతలు బసవతారకం ఆస్పత్రి 25 ఏళ్ల ప్రయాణంలో తమకు అండగా నిలిచారని చెప్పారు. ఏ ఒక్క క్యాన్సర్ రోగి కూడా డబ్బు లేదనే కారణంతో చికిత్సకు దూరం కాకూడదని పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నామని.. దాన్నే రాబోయే రోజుల్లోనూ కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ క్యాన్సర్‌ ఆస్పత్రిని నిర్మిస్తామని బాలకృష్ణ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్‌లో సేవలను మరింత విస్తరిస్తామని వెల్లడించారు.