ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు ఆలస్యంగా బయటపడటం నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగున ఉన్న వారికి అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఇంటి డోరు తెరిచి.. పరిశీలించగా.. నాలుగు మృతదేహాలు కనిపించాయి. అయితే అవి కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో.. వారు చనిపోయి కొన్ని రోజులు అవుతోందని తేల్చారు. ఆ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఏం జరిగిందోననే ఉత్కంఠ నెలకొంది. వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా కుటుంబాన్ని మొత్తం అంతం చేశారా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నల్గొండ సాగర్‌ రోడ్డులో ఉన్న తెలంగాణ కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు కనిపించాయి. అయితే వారు 4 రోజుల క్రితమే చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నలుగురిలో ఇద్దరు భార్యాభర్తలు అని పోలీసులు గుర్తించారు. వారు ఎండీ సుల్తాన్‌ ఆయన భార్య హసీనా అని తేల్చారు. అయితే మరో ఇద్దరు ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మిగితా ఇద్దరు సుల్తాన్, హసీనా దంపతుల పిల్లలు అని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్‌, క్లూస్ టీమ్‌తో కలిసి పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలో దొరికిన సాక్ష్యాధారాలను బట్టి.. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నల్గొండలోని ప్రకాశం బజార్‌లో ఎండీ సుల్తాన్‌ బ్యాగుల వ్యాపారం చేస్తుంటాడని.. ఇక ఆయన భార్య హసీనా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోందని స్థానికులు వెల్లడించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు ఏం జరిగింది అనేదానిపై ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా చనిపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే వారి కుటుంబానికి చెందిన మరో వ్యక్తి కనిపించకుండా పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్టు వస్తేనే వారి మరణాలకు కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.