కనీసం 7.10 శాతం నుంచే హోం లోన్ వడ్డీ రేట్లు.. ఎస్బీఐలోనూ చాలా తక్కువ.. 20 లక్షలకు ఈఎంఐ ఎంత?

Wait 5 sec.

: మనకు ఏదైనా అత్యవసరాల కోసం బ్యాంకుల్లో పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ తీసుకుంటుంటాం. పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యుర్డ్ లోన్. ఇక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ వేగంగానే మంజూరవుతుంది. గోల్డ్ లోన్ అంటే మన దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ తిరిగి చెల్లించకపోతే బంగారం పోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ లోన్ కాస్త తక్కువ మొత్తంలోనే వస్తుంది. అయితే హోం లోన్ గురించి తెలిసే ఉంటుంది. సొంత ఇల్లు కొనాలన్నా, కట్టుకోవాలన్నా గృహ రుణం తీసుకోవచ్చు. ఇక్కడ ఇతర చాలా రకాల లోన్లతో చూస్తే వడ్డీ రేట్లు చాలా తక్కువగానే ఉంటాయి. ఇంకా ఇవి సురక్షితం. అర్హత కలిగిన వారు బ్యాంక్ నుంచి హోం లోన్ తీసుకొని సొంతింట కల సాకారం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా క్రెడిట్ స్కోరు, ఆదాయం వంటివి కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇక హోం లోన్ అంటేనే చాలా ఎక్కువ మొత్తం తీసుకోవాల్సి వస్తుంది. పెద్ద మొత్తం కాబట్టి తిరిగి చెల్లించే కాల వ్యవధి కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి దీర్ఘ కాలంలో అధిక వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ వడ్డీ రేటు కాస్త తగ్గినా మొత్తం చెల్లించే వడ్డీపై గణనీయ ప్రభావం చూపిస్తుంది. అందుకే వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ బ్యాంకుల్లో చూసి మెరుగైన వడ్డీ రేట్లు ఉన్న దగ్గర లోన్ తీసుకోవడం మంచిది. ఆర్బీఐ కీలక రెపో రేట్లను గతేడాది భారీ స్థాయిలో తగ్గించగా చాలా బ్యాంకుల్లో భారీగా తగ్గాయని చెప్పొచ్చు. ఇప్పుడు పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చీప్‌గా హోం లోన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీసం 7.10 శాతానికే గృహ రుణాలు ఆఫర్ చేస్తోంది. మంచి ఆదాయం ఉండి, మెరుగైన సిబిల్ స్కోరు ఉంటే ఈ తక్కువ లేదా కనీస వడ్డీ రేటుకే లోన్ పొందొచ్చు. ఇక్కడ రూ. 20 లక్షల వరకు లోన్ తీసుకుంటే 7.10 శాతం వడ్డీ రేటుతో సుమారు పదేళ్లలో నెలకు రూ. 23,325 చొప్పున ఈఎంఐ పడుతుంది. మొత్తం టెన్యూర్‌కు దాదాపు రూ. 8 లక్షల వరకు వడ్డీ చెల్లించాలి. కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ల్లో 7.15 శాతం నుంచి హోం లోన్స్ ఉన్నాయి. ఇక్కడ రూ. 23,377 చొప్పున ఈఎంఐ పడుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంకుల్లో 7.20 శాతంగా ఉండగా 20 లక్షలపై ఈఎంఐ నెలకు ఇక్కడ రూ. 23,428 చొప్పున చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.25 శాతం వడ్డీ రేటు ఉండగా ఈఎంఐ నెలకు రూ. 23,480 చొప్పున పడుతుంది. మొత్తం 20 లక్షలపై వడ్డీ రూపంలో పదేళ్లలో ఇక్కడ రూ. 8.17 లక్షల వరకు చెల్లించాలి. HDFC హోం లోన్స్‌లో 7.75 శాతం నుంచి గృహ రుణాలు ప్రారంభమవుతుండగా 20 లక్షలపై నెలకు ఈఎంఐ రూ. 24,002 గా ఉంది. టాటా క్యాపిటల్, యాక్సిస్ బ్యాంకుల్లో 8 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇక్కడ ఈఎంఐ నెలకు రూ. 24,266 చొప్పున పడుతుంది. గమనిక: పైన ఇచ్చినవి ఆయా బ్యాంకుల్లో ప్రారంభ వడ్డీ రేట్లు మాత్రమే. క్రెడిట్ స్కోరు, మీరు తీసుకునే లోన్ మొత్తం, టెన్యూర్, ఆదాయాన్ని బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉండొచ్చు.