టీసీఎస్ ఒక్కటే ముంచేసింది.. 9 కంపెనీలు, 5 రోజులు.. ఇన్వెస్టర్లకు రూ. 2.15 లక్షల కోట్ల లాభం!

Wait 5 sec.

TCS Market Valuation: స్టాక్ మార్కెట్ అంటేనే ఒడుదొడుకులు ఉంటాయ. విపరీతమైన రిస్క్ ఉంటుంది. ఏ కారణాలతో సూచీలు రాణిస్తాయో, ఏ కారణాలతో పడతాయో, ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు ఎందుకు పడుతుందో ముందుగానే ఊహించడం కాస్త కష్టమే. ఎన్నో అంశాలు ఇక్కడ ముడిపడి ఉంటాయి. ఈ ఏడాది మార్చి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఇందుకు కారణం. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో స్టాక్ మార్కెట్లలో కూడా నష్టాలు వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో ఆ మధ్య భారత మార్కెట్ సూచీలు భారీగా తగ్గాయి. ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరగా సూచీలు పుంజుకున్నాయి. కిందటి వారంలో జూన్ 15- 19 మధ్య 5 ట్రేడింగ్ సెషన్లలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1275 పాయింట్లు లేదా 1.68 శాతం ఎగబాకింది. ఈ క్రమంలోనే ఆయా కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. టాప్- 10 కంపెనీల్లో 9 కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ రూ. 2.15 లక్షల కోట్ల మేర పెరగడం విశేషం. ఆయా కంపెనీల మార్కెట్ విలువనే మదుపరుల సంపదగా పరిగణిస్తుంటారు. దీంతో ఈ మేర ఇన్వెస్టర్లకు కూడా భారీగా లాభాలు వచ్చాయని చెప్పొచ్చు. ఇక గత వారంలో అత్యధికంగా భారతీ 5 రోజుల వ్యవధిలో రూ. 52,432.67 కోట్లు పెరిగి రూ. 11.62 లక్షల కోట్లకు చేరుకుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ. 51,675.23 కోట్లు పెరగడంతో ఇప్పుడు రూ. 5.56 లక్షల కోట్లుగా ఉంది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 26,553 కోట్లు పెరగడంతో ప్రస్తుతం రూ. 5.98 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్ విలువ పరంగా భారత్‌లో అతిపెద్ద కంపెనీగా ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం- క్యాప్ గత వారం రూ. 22,464 కోట్లు పెరగడంతో రూ. 17.71 లక్షల కోట్లుగా ఉంది. లార్సెన్ అండ్ టుబ్రో ఎం- క్యాప్ రూ. 21,929 కోట్లు పెరిగి రూ. 5.79 లక్షల కోట్లుగా ఉంది. ఎస్బీఐ మార్కెట్ విలువ 5 రోజుల్లో రూ. 16 వేల కోట్లకుపైగా పెరగడంతో ప్రస్తుతం ఎం క్యాప్ రూ. 9.55 లక్షల కోట్లకు చేరుకుంది. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 11,948 కోట్లు పెరిగి రూ. 12.01 లక్షల కోట్ల వద్ద ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ విలువ రూ. 6661 కోట్లు పెరిగి రూ. 5.15 లక్షల కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం క్యాప్ గత వారంలో రూ. 4724 కోట్లు పెరిగి రూ. 9.66 లక్షల కోట్ల వద్ద ఉంది. ఇదిలా ఉండగా అతిపెద్ద భారత ఐటీ కంపెనీ టీసీఎస్ మార్కెట్ విలువ కిందటి వారం రూ. 12,699 కోట్లు తగ్గి రూ. 7.69 లక్షల కోట్లుగా నమోదైంది.