: సమాజంలో సంపాదన, జీవన శైలిలో వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో పనిలో ఒక్కో రకంగా ఆదాయం ఉంటుంది. ఇక లైఫ్ స్టైల్ కూడా అంతే. వారి వారి ఆదాయాన్ని బట్టి మెయింటెయిన్ చేస్తుంటారు. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ఆదా చేయొచ్చు అన్నట్లుగా ఏం ఉండదు. "సాధారణంగా నెలకు లక్షల్లో జీతం వస్తే లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఇంకా భారీగా పొదుపు చేయొచ్చు, ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు." అని భావిస్తుంటారు. కానీ వాస్తవంగా కచ్చితంగా ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశమే లేదు. బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కథ వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌‌లో ఆ టెకీ చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన వార్షిక ప్యాకేజీ రూ. 96 లక్షలు అని, టాక్స్‌లు పోనూ ప్రతి నెలా చేతికి రూ. 3.5 లక్షలు వస్తాయని చెబుతున్నాడు. ESOPs రూపంలో రూ. 35 లక్షలు ఉంటాయని (ప్రస్తుతం స్టార్టప్ కంపెనీ కావడంతోనే దానిని ఆయన లెక్కలోకి తీసుకోలేదు) అంటున్నాడు. అయినా నెలకు లక్షల్లో ఇలా జీతం ఉన్నప్పటికీ కనీసం నెలకు రూ. 50 వేలు కూడా ఆదా చేయలేకపోతున్నానని తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాడు. పెరుగుతున్న ఖర్చుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని అంటున్నాడు. అతడికి నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు.ఇన్ని ఖర్చులా?ఇప్పుడు కాస్తో కూస్తో నెలకు రూ. 45- 50 వేల వరకు కష్టంగా ఆదా చేస్తున్నప్పటికీ, ఒకవేళ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటనే ఆందోళన తనను నిత్యం వెంటాడుతుందని వాపోయాడు. తన జీతంలో ఈఎంఐలే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం నెలకు రూ. 80 వేలుగా ఉండగా ఇదే అతడిపై పెను భారం చూపుతోంది. ఇంకా పదేళ్ల వరకు గడువు ఉంది. కార్ లోన్ ఈఎంఐ రూ. 30 వేలుగా ఉండగా, మరో రూ. 10 లక్షలు చెల్లించాల్సి ఉంది. పిల్లలకు స్కూల్, డే కేర్ కోసం రూ. 50 వేల వరకు అవుతుంది. పని మనిషి, వంట మనిషి కోసం రూ. 6 వేలు, పిల్లల కోసం ఆయాకు రూ. 40 వేలు, నిత్యావసరాలు రూ. 20 వేలు, జిమ్ కోసం రూ. 8 వేలు, కరెంట్ అండ్ మెయింటెనెన్స్ రూ. 15 వేలు ఇలా చాలా ఖర్చులు ఉండగా ఏమీ మిగలట్లేదని వాపోతున్నాడు. రూ. 3 కోట్ల సంపద ఉంది- బ్రేక్ కుదరట్లేదు..ఇక ప్రస్తుతం తన నికర సంపద రూ. 3 కోట్లుగా ఉందని, ఏటా కేవలం రూ. 4-5 లక్షలు మాత్రమే కష్టంగా యాడ్ చేయగలుగుతున్నానని అంటున్నాడు. ఈ ఖర్చుల వలయం నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలని ఉన్నా, ఈఎంఐల ఒత్తిడి నేపథ్యంలో కుదరట్లేదని చెబుతున్నాడు. అతడి పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'ఖర్చులు తగ్గించుకునేందుకు బెస్ట్ ఆప్షన్. మీ ఊరి నుంచి మీ పేరెంట్స్‌ను తీసుకొచ్చి మీతో ఉంచుకోండి. పిల్లల బాధ్యత చూసుకుంటారు. నానీ, డేకేర్ ఖర్చులు తగ్గుతాయి. సొంతూరికి వెళ్లే ఖర్చులు కూడా ఆదా చేసుకోవచ్చు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది." అని సలహాలు ఇస్తున్నారు.ఇంకొకరేమో 'నువ్వు టెక్నికల్‌గా నెలకు రూ. 1.4 లక్షలపైనే దాస్తున్నావ్. హోం లోన్ కడుతున్నావంటే అది నీ సొంత ఆస్తిలో పెట్టుబడి కిందే లెక్క. కార్ లోన్ కూడా అంతే. కాబట్టి టెన్షన్ పడకు. చిల్ అవ్వు.' అంటున్నాడు. ఇక మీదట ఎంత మిగులుతుందని అనేది ఆలోచించడం మానేసి.. ఆ రూ. 3 కోట్లను సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేసి దానిని వేగంగా ఎలా వృద్ధి చేయాలో ఆలోచించు అని మరికొందరు సూచిస్తున్నారు. మెట్రో నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం, చైల్డ్ కేర్ ఖర్చులు ఎలా ఉంటాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే సంపాదన ఎంత ఉన్నప్పటికీ, సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నా అప్పులు (ఈఎంఐ) ఎక్కువగా ఉంటే అది ఏ స్థాయి ఉద్యోగికైనా తీవ్ర అలసట, ఒత్తిడి కలిగిస్తుందని ఈ ఘటన నిరూపిస్తోంది.