హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో ప్రతిరోజూ ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్ జాం. ముఖ్యంగా కొద్దిపాటి వర్షం పడినా గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ రోడ్లు నరకాన్ని తలపిస్తాయి. చిన్న చిన్న పనులకు, స్వల్ప దూర ప్రయాణాలకు కూడా చాలా మంది సొంత కార్లను, ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుండటంతో రోడ్లపై విపరీతమైన రద్దీ పెరుగుతోంది. ఈ తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలోని అర్బన్ మాస్ ట్రాన్సిట్ అథారిటీ (UMTA) వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ఇప్పటికే అందుబాటులో ఉన్న సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను ఐటీ అంతర్గత ప్రాంతాలతో పూర్తిస్థాయిలో అనుసంధానించాలని నిర్ణయించింది.ప్రస్తుతం ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు వెంబడి నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, అలాగే నార్సింగి నుంచి కొల్లూరు జంక్షన్ వరకు 14.5 కిలోమీటర్ల మేర మొత్తం 23 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ ప్రమాణాల సైకిల్ ట్రాక్ అందుబాటులో ఉంది. ఈ ట్రాక్‌పైకి కొల్లూరు, వట్టినాగులపల్లి, నానక్‌రాంగూడ, పోలీస్ అకాడమీ వద్ద ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. అక్కడ సైకిళ్లను అద్దెకు తీసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే.. ఈ ట్రాక్‌కు సమీపంలోని ఐటీ హబ్‌లు, నివాస కాలనీలతో సరైన కనెక్టివిటీ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో సైకిలిస్టులు దీనిని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ లోపాన్ని సవరిస్తూ.. నేరుగా ఐటీ కంపెనీల ప్రాంగణాల నుంచే ఈ సైకిల్ ట్రాక్‌ను చేరుకునేలా 10 కీలక ప్రతిపాదిత మార్గాలను అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనం ద్వారా గుర్తించారు. ఐటీ కారిడార్‌లోని చాలా రోడ్లు 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు కలిగి ఉండటం వల్ల ప్రత్యేక సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు సులువవుతుందని అధికారులు భావిస్తున్నారు.ఉమ్టా గుర్తించిన ఆ 10 కీలక ప్రతిపాదిత మార్గాలు ఇవే..హైటెక్ సిటీ లోప్: సైబర్ టవర్స్ నుంచి ఇనార్బిట్ మాల్ మీదుగా తిరిగి సైబర్ టవర్స్ వరకుగచ్చిబౌలి కనెక్టివిటీ: హెచ్‌బీసీ బైక్ స్టేషన్ నుంచి ఐకియా, రాంకీ టవర్స్, రాడిసన్ హోటల్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా సైబరాబాద్ కమిషనరేట్ వరకుకోకాపేట వింగ్ రాడిసన్ నుంచి కోకాపేట వయా గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఐడీబీఐ, ఐఎస్‌బీ మీదుగా తిరిగి రాడిసన్ వరకుఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హబ్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వేవ్‌రాక్, ఐసీఐసీఐ టవర్స్, ఐఆర్‌డీఏఐ మీదుగా యూఎస్ కాన్సులేట్ వరకుఐటి ఇన్‌స్టిట్యూట్స్ లైన్: ఐఐఐటీ హైదరాబాద్ నుంచి గచ్చిబౌలి స్టేడియం, టీసీఎస్ సినర్జీ పార్క్ మీదుగా డీఎల్ఎఫ్ వరకుబొటానికల్ గార్డెన్ లూప్: డీఎల్ఎఫ్ నుంచి రాడిసన్ హోటల్, బొటానికల్ గార్డెన్, చిరాగ్ క్రాస్ రోడ్స్ మీదుగా తిరిగి డీఎల్ఎఫ్ వరకుకార్పొరేట్ జోన్: బొటానికల్ గార్డెన్ నుంచి కోకాపేట, సీఐఐ, మహీంద్రా, హెచ్‌ఎస్‌బీ, లెమన్ ట్రీ హోటల్ మీదుగా డెలాయిట్ డ్రైవ్ వరకుకూకట్‌పల్లి లింక్: సైబర్ టవర్స్ నుంచి జేఎన్‌టీయూ వయా హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్, మలేసియన్ టౌన్‌షిప్, ఫోరం నెక్సస్ మాల్ వరకుకోర్ సిటీ కనెక్షన్: సైబర్ టవర్స్ నుంచి జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ మీదుగా అమీర్‌పేట వరకుకేబీఆర్ పార్క్ రూట్: ఇనార్బిట్ మాల్ నుంచి నెక్టార్ గార్డెన్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45, కేబీఆర్ పార్క్ మీదుగా తిరిగి ఇనార్బిట్ మాల్ వరకుఈ 10 ప్రతిపాదిత మార్గాలలో సైకిల్ ట్రాక్‌లను అత్యాధునికంగా తీర్చిదిద్ది, వాటిని ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్‌తో అనుసంధానించడం ద్వారా నిత్యం ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చనున్నారు. కాలుష్యం తగ్గడంతో పాటు నగరవాసులకు శారీరక వ్యాయామం, ఆరోగ్యం చేకూరుతాయని హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయి.