Tax Refund: పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు ట్యాక్స్ స్లాబుల ప్రకారం పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే, వివిధ మినహాయింపులు, డిడక్షన్లను క్లెయిమ్ చేస్తూ అదనపు పన్నులను తిరిగి పొందేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి ఐటీ రిటర్నులు దాఖలు చేయలేకపోయినట్లయితే వారు ఇప్పుడు రీఫండ్ పొందేందుకు ఏం చేయాలి? ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసెస్మెంట్ ఇయర్ 2025-26కి సంబంధించిన ఐటీఆర్ ఇప్పటికీ ఫైల్ చేసే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారులు అప్‌డేటెడ్ రిటర్న్(ITR-U) దాఖలు చేసేందుకు పన్ను నిబంధనలు 4 సంవత్సరాల వరకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, పన్ను రీఫండ్ (tax Refund) పొందే అర్హత ఉంటుందా? అనే సందేహం ఉంటుంది. ఇచ్చిన గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయలేకపోవడం అంటే కచ్చితంగా రీఫండ్ క్లెయిమ్ చేయలేమని కాదు. మీ శాలరీ లేదా బ్యాంక్ వడ్డీ, ఇతర ఆదాయం నుంచి ఆర్థిక సంవత్సరం 2024-25లో అదనపు ట్యాక్స్ డిడక్ట్ చేసినట్లయితే మీరు ఇప్పటికీ మీ అదనపు పన్నులను రీఫండ్ పొందవచ్చు. అయితే అందుకు కొన్ని సందర్భాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ అనేది మే నెల నుంచే మొదలవుతుంది. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లు జులై 31వ తేదీలోపు తమ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆడిట్ అవసరమైన వారికి అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే వివిధ కారణాలతో ఈ గడువు తేదీలను పొడగిస్తూ వస్తున్నారు. ఒక వేళ మీరు ఈ గడువు తేదీలలోపు ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్ అయితే బిలేటెడ్ ఐటీఆర్ అనేది డిసెంబర్ 31వ తేదీ వరకు ఫైల్ చేయవచ్చు. సెక్షన్ 234F ప్రకారం గరిష్ఠంగా రూ.5 వేల పెనాల్టీ కట్టాలి. అంటే తమ రీఫండ్ క్లెయిమ్ చేసేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. కానీ, కొన్ని ట్యాక్స్ రూల్స్ బిలేటెడ్ రిటర్న్ గడువు (డిసెంబర్ 31) దాటిన తర్వాత సైతం రీఫండ్ క్లెయిమ్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. రీఫండ్ ఎలా క్లెయిమ్ చేయాలి?అయితే, క్లెయిమ్ చేసుకునే అవకాశం ఆధారపడుతుంది. ఇది పన్ను అధికారుల విచక్షణకు లోబడి ఉంటుంది. సెక్షన్ 119 (2)(b) కింద మన్నించమని కోరుతూ దరఖాస్తు ఫైల్ చేయవచ్చు. సరైన కారణాలు చెప్పి పన్ను అధికారులను ఒప్పించగలిగితే అవకాశం ఇస్తారు. సీబీడీటీ మార్గదర్శకాల ప్రకారం కొన్ని మినహాయింపులు, షరతులకు లోబడి రీఫండ్ క్లెయిమ్ చేసేందుకు సంబంధించిన మినహాయింపు దరఖాస్తును సంబంధిత అసెస్మెంట్ ఇయర్ ముగిసిన 5 సంవత్సరాల లోపు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. పన్ను చెల్లింపుదారు కొన్ని షరతుల ఆధారంగా మాత్రమే ఆదాయపు పన్ను శాఖ నుంచి మినహాయింపు అభ్యర్థన కోసం అధికార నోటీసు స్వీకరించిన తర్వాత ITR దాఖలు చేయవచ్చు. మీరు ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేయడానికి లేదా రీఫండ్ లేదా నష్టాన్ని ముందుకు తీసుకువెళ్లడం క్లెయిమ్ చేయడానికి ఇచ్చే కారణం చట్టబద్ధమైనదని ఆదాయపు పన్ను శాఖ నిర్ధారిస్తే, మీరు ఆలస్యానికి మినహాయింపునకు అర్హులు కావచ్చు. ఈ సేవను ఉపయోగించుకోవడానికి మీ వద్ద చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడి, పాస్‌వర్డ్, ఆలస్యానికి మినహాయింపు కోరుతూ జారీ అయిన ప్రత్యేక సంఖ్యతో కూడిన PCIT ఉత్తర్వు, చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా, అలాగే Form 26AS, AIS ఉండాలి.