గతేడాది పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. బగ్లీహార్, సలాల్‌ డ్యామ్‌లను మూసివేసి, నదీ ప్రవాహ డేటాను కూడా పంచుకోవడం భారత్ నిలిపివేసింది. దీంతో దాయాది సాగు, తాగు నీటికి కటకటలాడుతోంది. ఇటీవల మరోసారి భారత్‌పై కవ్వింపులకు పాల్పడ్డారు. తమ జల భద్రతకు ముప్పు ఏర్పడితే యుద్ధానికైనా వెనుకాడబోమని బెదిరింపులకు దిగారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత విమానాలకు తన గగనతలాన్ని పాక్ నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధు జలాల కోసం పాకిస్థాన్ కొత్త పన్నాగానికి తెరతీసింది. తమ విమానాల కోసం పాకిస్థాన్ గగనతలాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా తెరిస్తే.. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్దరిస్తామని, నదులలను సహజంగా ప్రవహింపజేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ చెప్పినట్టు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టింది. పాక్ సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. సింధు జలాల విషయంలో భారత్ ప్రతిపాదనపై పాకిస్థాన్ ఇంకా స్పందించలేదని ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌ల మధ్య ఒక ఆశాకిరణం... ఈ ప్రాంతానికి గోడలు కాదు, వంతెనలు కావాలి.. భారత విమానాల కోసం పాకిస్థాన్ తన గగనతలాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా తెరిస్తే, దానికి ప్రతిగా ‘సింధు జలాల ఒప్పందాన్ని’ పునరుద్ధరించి, నదులను సహజంగా ప్రవహింపజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్ పాకిస్థాన్‌కు తెలియజేసింది.. దీనిపై పాకిస్థాన్ ఇంకా స్పందించలేదు.. కానీ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం ఒక సానుకూల సంకేతం. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రాంతానికి గోడలు కాదు, వంతెనలు కావాలి. ఇదే సరైన మార్గం’’ అని పాకిస్థాన్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఎక్స్‌లో చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. భారత విమానాల కోసం పాకిస్థాన్ తన గగనతలాన్ని తెరిస్తే, సింధు జలాల ఒప్పందం పునరుద్దరణకు భారతదేశం అంగీకరిస్తుందని ఇదంతా పాకిస్థాన్ గూఢచారి సంస్థలు అల్లుతోన్న కట్టకథలు. ఇటువంటి ప్రతిపాదనలు ఏదీ భారత్ వైపు నుంచి వెళ్లలేదని సీనియర్ జర్నలిస్ట్ తెలిపారు. ‘‘భారత విమానాల కోసం పాకిస్థాన్ తన గగనతలాన్ని తెరిస్తే సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్దరించి, నదుల్లో ప్రవాహాలను అనుమతించడానికి భారతదేశం అంగీకరిస్తుందని పాకిస్థానీ గూఢచారి సంస్థ ఇప్పుడు కథనాలను ప్రచారం చేస్తోంది. ఇది పూర్తిగా శుద్ధ అబద్ధం. ఆర్టికల్ 370 లాగే సింధు జలాల ఒప్పందం కూడా చెత్తబుట్టలోనే ఉండిపోతుంది. పాకిస్థాన్ తన ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది’’ అని ఆయన కౌంటర్ ఇచ్చారు.