ఏపీ ప్రభుత్వం ఒక గంట కార్యక్రమం కోసం రూ.600 కోట్లు ఖర్చు చేసిందా?.. ఓహో అసలు సంగతి అదన్నమాట

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర-2026 వేడుకలు 1.05 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించారు. ఆదివారం రోజు 1.32 లక్షల వేదికల్లో యోగా సాధనలో 551 మంది యోగా గురువులు.. 7,754 మంది మాస్టర్‌‌లు పాల్గొన్నారు. లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఈ అద్భుత ఘట్టానికి స్థానం దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధ్రువీకరణ పత్రాన్ని వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సౌత్‌ ఇండియన్‌ రీజియన్‌ జాయింట్‌ సెక్రటరీ విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర రాష్ట్రస్థాయి కార్యక్రమంలో అందజేశారు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన యోగా డే వేడుకల్లో.. యోగా గురువు బాబా రాందేవ్‌, పతంజలి సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ఈ యోగా వేడకల్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగా సాధనలో పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగా గురువుల పర్యవేక్షణలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులతోపాటు లక్షల మంది ప్రజలు ఈ యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అయితే రాష్ట్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి రూ.వందల కోట్లలో భారీగా ఖర్చు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ ఈ అంశంపై స్పందించింది, క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించిందని.. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించిదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల నిర్వహించిన యోగా కార్యక్రమంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం కోసం రూ. 600 కోట్లు ఖర్చు అయినట్లు చెప్పడం పూర్తిగా అసత్యమన్నారు. రాష్ట్రంలో యోగా కార్యక్రమం నిర్వహించడానికి వీలుగా జిల్లాకు రూ.25 లక్షలు మాత్రమే కేటాయిస్తూ జీవో ఆర్టీ నెం 562 తేదీ జూన్ 5 2026న విడుదల చేసినట్లు ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దాదాపు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఆరోగ్యం పెంపొందించేందుకు అవసరమైన అవగాహన కల్పించేందుకు 10 లక్షల మంది యోగా శిక్షకులను తయారు చేయడం లక్ష్యమన్నారు. రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమానికి కేటాయించింది కేవలం రూ.3 కోట్లు మాత్రమేని.. వాస్తవాలు ఇలా ఉండగా భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని.. ఇలా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్.