బాసర ఆలయంలో భారీ చోరీ.. అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరణ

Wait 5 sec.

తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ఆవరణలో గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. సరస్వతీ దేవి ఆలయ పైఅంతస్తులో కొలువై ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి గుడిని టార్గెట్ చేసిన దుండగులు.. పక్కా స్కెచ్‌తో లోపలికి చొరబడి అమ్మవారి వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆలయ వర్గాల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటాక దొంగలు మహంకాళి ఆలయ ప్రధాన గేటు తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భగుడిలోకి చొరబడిన దుండగులు అమ్మవారి అలంకరణకు ఉపయోగించే వెండి కిరీటాన్ని దొంగిలించారు. అంతటితో ఆగకుండా భక్తులు సమర్పించిన కానుకలతో ఉన్న ఆలయ హుండీని సైతం అలాగే పెకలించి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణం వెలుపలికి వెళ్లిన దొంగలు.. హుండీ తాళాలు పగలగొట్టి అందులోని నగదు మొత్తాన్ని కాజేశారు. అనంతరం ఖాళీ హుండీని సమీపంలోని వ్యాసగుడి వద్ద పడేసి.. అక్కడి నుంచి చాకచక్యంగా పరారయ్యారు.మంగళవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు నిత్య పూజల నిర్వహణ కోసం, సుప్రభాత సేవ ముగించుకుని పైఅంతస్తులోని మహంకాళి గుడికి వెళ్లడంతో ఈ దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ సింహద్వారం గేటు విరిగిపోయి ఉండటం, గర్భగుడిలో సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి అర్చకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అమ్మవారి కిరీటం, హుండీ మాయమైనట్లు గుర్తించి వారు వెంటనే ఆలయ ఉన్నతాధికారులకు, ఈవోకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ముందస్తు ఆధారాల కోసం ప్రత్యేక క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో గట్టి నిఘా ఉన్నప్పటికీ దొంగలు ఇంత సాహసానికి ఒడిగట్టడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో, వెలుపల ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అంతర్గత భద్రతా సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించారా? లేదా స్థానికుల హస్తం ఏదైనా ఉందా? అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనతో బాసర క్షేత్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.