పాకిస్థాన్‌ వెళ్లేందుకు మత మార్పిడు, ఉగ్రవాద సంస్థలతో లింకులు.. జైపూర్‌లో మహిళ అరెస్ట్

Wait 5 sec.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఓ మహిళను అరెస్టు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మొహమ్మద్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్లీపర్ సెల్స్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వాట్సాప్‌లో పాక్ నెంబర్లతో పాటు మత మార్పిడులకు కూడా పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వివరాల మేరకు.. గంగాపూర్‌కు చెందిన బబితా ధాకడ్ అనే మహిళ జైపూర్‌లో ఉంటుంది. మత మార్పిడులు చేస్తుందనే అనుమానంతో ఆమెపై నిఘా పెట్టిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు బబితా అనే పేరే కాకుండా ఖదీజా అనే పేరు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రాథమిక విచారణలో భాగంగా ఆమె మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు సిమ్ కార్డులు, ఫేస్‌బుక్ అకౌంట్‌లో కొన్ని అభ్యంతరకర కంటెంట్, విదేశీ వ్యక్తులతో సంబంధాలు, జైష్ ఏ మొహమ్మద్‌కు సంబంధించిన జెండాలు, ఫొటోలు.. ఆయుధాలు పట్టుకున్న వ్యక్తులు ఫొటోలు ఆమె ఫోన్‌లో లభించినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన ఓ మత గురువు ఫోన్ ద్వారా ఆమెను మత మార్పిడికి ప్రోత్సహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అబూ ఉబైదా అనే వ్యక్తితో వివాహం జరిపించాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రార్థనలు చేయడం, ఖురాన్ చదవడం, ఇస్లామిక్ ఆచారాలు పాటించాలని సూచించినట్లు విచారణలో బయటపడింది. ఆమెను నేపాల్, సౌదీ అరేబియా, యూఏఈ మార్గాల ద్వారా పాకిస్థాన్‌కు తరలించే ప్రణాళిక కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో ఉగ్రవాద కేసులతోనూ ఆమెకు లింకులు ఉన్నట్లు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. మజూద్ అజర్ అనుచరులతో ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ కేసుకు సంబంధించిన వ్యక్తులతోనూ సంబంధాలు ఉన్నట్లు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఆరు నుంచి 7 నెలలుగా ఆమెను మత మార్పిడికి గురి చేయడానికి భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడానికి ప్రయత్నాలు జరిగి ఉండొచ్చని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.