: మార్కెట్ విలువ పరంగా భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఐటీ దిగ్గజం పరిస్థితి ఇటీవలి కాలంలో ఏమంత బాగోలేదు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరిగినప్పటి నుంచి ఈ సంప్రదాయ ఐటీ కంపెనీల లాభాదాయాలపై గణనీయమైన ప్రభావం పడుతుంది. టీసీఎస్ ఒక్కటే కాదు ఇతర భారత ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా అన్నీ ప్రభావితమవుతూనే ఉన్నాయి. దీంతో ఇవి కూడా మెల్లగా తమ వ్యూహాలకు పదును పెడుతూ ఏఐపై పెట్టుబడులు పెడుతూ సామర్థ్యాల్ని విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఏ మేరకు వీటిపై పెట్టుబడులు పెట్టింది ఎలా రాణిస్తుందనేది కొద్ది రోజుల్లోనే తెలియనుంది. టీసీఎస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ మొదటి త్రైమాసికం జూన్ 30తో ముగియనుండగా అప్పుడే తొలి త్రైమాసికం ఫలితాల తేదీని ప్రకటించడం విశేషం. వచ్చే నెల జులై 9న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై త్రైమాసిక ఫలితాలకు ఆమోదం తెలిపి, అదే రోజున ఫలితాల్ని ప్రకటిస్తారని పేర్కొంది. ఇంకా ఇంటీరిమ్ డివిడెండ్‌ను (మధ్యంతర డివిడెండ్‌) కూడా పరిశీలిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం రోజు స్టాక్ ఎక్స్చేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ వివరాల్ని వెల్లడించింది. దీనిని ప్రకటిస్తే రికార్డ్ డేట్ జులై 18 గా ఉంటుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీసీఎస్ తుది డివిడెండ్ ఒక్కో షేరుకు రూ. 31 గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి ముందు జనవరిలో స్పెషల్ డివిడెండ్ రూ. 46 తో కలిపి మొత్తం డివిడెండ్ రూ. 57 గా ప్రకటించింది. మరి ఇప్పుడు మధ్యంతర డివిడెండ్ ఎంత ప్రకటిస్తుందో చూడాలి. TCS Q4 Results:ఇటీవల 2025-26 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం 12.22 శాతం పెరిగి రూ. 13,718 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ (PAT) చూస్తే 1.35 శాతం పెరిగి రూ. 49,210 కోట్లకు చేరుకుంది. ఏకీకృత ప్రాతిపదికన క్యూ4లో కార్యకలాపాల ఆదాయం 9.6 శాతం పెరిగి రూ. 70,698 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 2.67 లక్షల కోట్లకు చేరుకుంది. TCS Shares Fall:ఇదిలా ఉంటే ఇటీవల టీసీఎస్ షేరు భారీగా పతనం అవుతోంది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు చూస్తే షేరు ధర రూ. 3215 నుంచి 2129 కు దిగొచ్చింది. ఇది దాదాపు 35 శాతం పడిపోయిందన్నమాట. ఈ క్రమంలో మార్కెట్ విలువ రూ. 3.61 లక్షల కోట్లు తగ్గగా ఇన్వెస్టర్లు ఆ మేర నష్టపోయారు. ఆల్ టైమ్ హై వాల్యూ 2024 ఆగస్టులో రూ. 4592.25 ను తాకగా అక్కడి నుంచి భారీ పతనంతో 2 రోజుల కిందట రూ. 2059.90 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. ఒక దశలో గరిష్ఠ స్థాయిల వద్ద సంస్థ మార్కెట్ వాల్యూ రూ. 16.50 లక్షల కోట్లుగా ఉండగా ఇప్పుడు అది రూ. 7.70 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ క్రమంలో దాదాపు రూ. 9 లక్షల వరకు నష్టాల్ని మిగిల్చింది.