అమెరికాను ఇరాన్ ఎప్పటికీ నమ్మలేదని, భవిష్యత్‌లో కూడా నమ్మదని ఇరాన్ కీలక నేత మొహమ్మద్ బాఘేర ఘాలిబాఫ్ అన్నారు. స్విట్జర్లాండ్‌లో అమెరికాతో జరిగిన చర్చల అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఇరానియన్ మీడియాతో ఆయన మాట్లాడారు. హార్మూజ్ జలసంధిలో రణరంగమే అని, యుద్ధానికి ముందులా ఇక ఎప్పటికీ వెళ్లదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్‌లో ఇరాన్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అమెరికా - ఇరాన్ ఉద్రిక్తతల నడుమ హార్మూజ్‌లో ప్రయాణించే ప్రపంచ దేశాల నౌకల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఓ మధ్యస్థ మార్గం తయారు చేస్తున్నారు. దీని కోసం అమెరికాతో సహా ఇతర దేహాలతో కలిసి ప్రత్యేక టెలిఫోన్ హాట్‌లైన్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు ఘాలిబాఫ్ తెలిపారు. అమెరికా- ఇరాన్ మధ్య ఓ సమన్వయ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఘాలిబాఫ్ వెల్లడించారు. నౌకలకు ఏదైనా సందేహం కానీ సమస్య కానీ తలెత్తినప్పుడు ఆ కేంద్రాన్ని సంప్రదించవచ్చని చెప్పారు. కేవలం ఈ మార్గం ద్వారా మాత్రమే హార్మూజ్ జలసంధిలో నౌకా రవాణా సాఫీగా కొనసాగే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని చెప్పడం విశేషం. ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే తుది ఒప్పందానికి ఈ చర్చలు పునాది వేశాయని తెలిపారు. ఇరుదేశాల వాదన ఎలా ఉన్నప్పటికీ శాంతి ఒప్పందం తర్వాత హార్మూజ్ జలసంధిలో నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉంది. యుద్ధం ప్రారంభంలో హార్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వత తిరిగి తెరుచుకుంది. ఈ చర్యతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హార్మూజ్‌పై పూర్తి నియంత్రణ తమదే అంటున్నారు. "హార్మూజ్ జలసంధిపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. మా నౌకాదళం అక్కడ ఉంది. బాంబులు వేయడం కంటే దిగ్బంధనం మరింత ప్రభావవంతంగా పనిచేసింది. హార్మూజ్ ఇప్పుడు తెరిచి ఉంది. అక్కడ నుంచి రికార్డు స్థాయిలో చమురు రవాణా సాగుతోంది" అని ట్రంప్ అన్నారు.