పీపీఎఫ్ స్కీమ్.. గడువు ముగిశాక ఏం చేయాలో తెలుసా.. మీకు 3 ఆప్షన్లు ఉంటాయ్!

Wait 5 sec.

పెట్టుబడులు పెట్టాలని చూసే వారు ఎక్కువగా రిస్క్ లేకుండా చూసుకుంటారు. ఇలా రిస్క్ లేకుండా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చే పథకాల్లో పోస్టాఫీస్ స్కీమ్స్ ముందు వరుసలో ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కు మంచి ఆదరణ ఉంది. లాంగ్ రన్‌లో ఇక్కడ రాబడి పెద్ద మొత్తంలో సమకూరుతుంది. ఇంకా టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్‌పై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. చాలా చిన్న మొత్తాల్లోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ స్కీమ్ విషయానికి వస్తే ప్రస్తుతం వడ్డీ రేట్లు 7.10 శాతంగా ఉన్నాయి. ప్రతి 3 నెలలకు ఓసారి కేంద్రం వడ్డీ రేట్లను సవరించాల్సి ఉంటుంది. పెట్టుబడి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి పెట్టొచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ. 1.50 లక్షలుగా ఉంటుంది.ఈ స్కీంలో వరుసగా 15 సంవత్సరాలు డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత గడువు ముగిశాక వెంటనే పీపీఎఫ్ అకౌంట్ రద్దవదు. ఇక్కడ మనకు 3 ఆప్షన్లు ఉంటాయి. ఏం చేయాలనేది ఖాతాదారుడు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. 15 ఏళ్ల వ్యవధి ముగిసిన తర్వాత ఖాతాను రద్దు చేసుకొని, పీపీఎఫ్ డబ్బులు మొత్తం ఉపసంహరించుకోవచ్చు. రిటైర్మెంట్, పిల్లల చదువులు, ఇతర ఆర్థిక అవసరాలు ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అకౌంట్ క్లోజ్ చేసుకొని డబ్బులు తీసుకోవచ్చు.రెండో ఆప్షన్ విషయానికి వస్తే ఇక్కడ పీపీఎఫ్ అకౌంట్‌ను అయిదేళ్ల చొప్పున ఎన్ని సార్లయినా పొడిగించుకోవచ్చు. ఈ సందర్భంలో పెట్టుబడులు కూడా కొనసాగించే వీలు ఉంటుంది. దీని వల్ల చక్రవడ్డీ ప్రయోజనం పెరుగుతుంది. అలా ఎన్నిసార్లయినా అయిదేళ్ల చొప్పున పొడిగించుకునే వీలుంటుంది.మూడో ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఎలాంటి కొత్త నిధులు జమ చేయకుండానే, అంటే కొత్తగ పెట్టుబడి లేకుండానే ఖాతాను అయిదేళ్ల చొప్పున పొడిగించుకునే వీలుంటుంది. ఈ విధానంలో పాత నిల్వలపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేటు లభిస్తూనే ఉంటుంది. ఈ వడ్డీపై కూడా ఎలాంటి పన్ను ఉండదు.పీపీఎఫ్ అకౌంట్లో జమ చేసే మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఆర్జించిన వడ్డీకి పన్ను ఉండదు. ఈ పన్ను రహిత వృద్ధి కొనసాగించేందుకు చాలా మంది మదుపరులు ఖాతా పొడిగించుకునేందుకు ఇష్టపడతారు. అయిదేళ్ల వ్యవధి ప్రారంభానికి ముందు పీపీఎఫ్ అకౌంట్లోని గరిష్టంగా 60 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు. 15 ఏళ్ల వ్యవధి తీరిన తర్వాత ఖాతా నుంచి డబ్బుల్ని ఉపసంహరించుకోవాలా వద్దా అనేది పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు అవసరాల ఆధారంగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.