కేతన్ అగర్వాల్ హత్య కేసు.. రంగంలోకి ముంబై ఉగ్రదాడుల కేసు లాయర్.. ఎవరీ ఉజ్వల్‌ నికమ్‌‌?

Wait 5 sec.

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో సినిమాను మించిన ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. కాబోయే భర్తను లోయలోకి తోసి కాబోయే భార్య హత్య చేసిన ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో దేశంలోనే ప్రముఖ లాయర్ ఉజ్వల్‌ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నియామకానికి సంబంధించిన విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది.పుణెలోని చారిత్రక లోహ్‌గఢ్‌ కోట వద్ద కేతన్‌ అగర్వాల్‌ను లోయలోకి తోసి హత్య చేసిన ఘటనలో అతడికి కాబోయే భార్య సియా గోయల్‌, ఆమె ప్రియుడు చేతన్‌ నిందితులుగా ఉన్నారు. అయితే కేతన్ అగర్వాల్ మృతి పట్ల తీవ్ర దుఃఖంలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు.. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని.. శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ కుమారుడి మరణం కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ చేసి.. దోషులుగా తేలిన వారికి కఠిన శిక్ష విధించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఫడ్నవీస్.. కీలక నిర్ణయం తీసుకున్నారు.కేతన్ అగర్వాల్ మృతి కేసు.. చాలా దిగ్భ్రాంతికరమైన ఘటన అని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు సీనియర్‌ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. అందుకు నికమ్‌ ఉజ్వల్ కూడా అనుమతి తెలిపారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయశాఖను ఆదేశించినట్లు చెప్పిన మహారాష్ట్ర సీఎం.. ఈ కేసులో ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఎవరీ ఉజ్వల్‌ నికమ్‌?దేశంలోనే ప్రముఖ లాయర్లలో ఒకరైన ఉజ్వల్‌ నికమ్‌.. 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో వాదనలు వినిపించారు. ఈ కేసుతో ఆయన పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. ఈ ముంబై కేసుతోపాటు.. చాలా సంచలనం రేపిన క్రిమినల్‌ కేసుల్లో ఉజ్వల్ నికమ్.. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వాదనలు వినిపించారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉత్తర-మధ్య ముంబై నియోజకవర్గం నుంచి పోటీచేసి.. కాంగ్రెస్‌ అభ్యర్థి వర్ష గైక్వాడ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఉజ్వల్ నికమ్ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో ఈ కేసు ఇప్పటికే దేశం మొత్తం సంచలనం రేపిన ఈ కేసులో ఉజ్వల్ నికమ్ వాదనలు వినిపిస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.