తెలంగాణలో అధికారంలోకి రావాలనే బలమైన సంకల్పంతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం.. రానున్న రోజుల్లో రాష్ట్రంపై మరింత పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మార్పులు, చేర్పులపై భాజపా రాష్ట్ర శాఖ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. తెలంగాణ నుంచి ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈ విస్తరణలో రాష్ట్రం నుంచి మరొకరికి అవకాశం లభిస్తుందా..? లేదా ఉన్న ఇద్దరికే పరిమితం చేస్తారా..? లేక ఏవైనా ఊహించని మార్పులు ఉంటాయా..? అన్న అంశంపై కమలదళంలో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణ నుంచి బీజేపీకి ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. సీనియర్ నేత డాక్టర్ కె. లక్ష్మణ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత మోదీ మంత్రివర్గంలో సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్‌రెడ్డి కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జెండా పాతాలని గట్టిగా బీజేపీ ప్రయత్నిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత అత్యధిక రాజకీయ అవకాశాలు, అనుకూలత ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని బీజేపీ జాతీయ నాయకత్వం బలంగా నమ్ముతోంది. అందుకే జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు.రాష్ట్రంలో పార్టీ సీనియర్ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలపైనా అధిష్ఠానం కొంతకాలంగా ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ తరుణంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణను ఒక అస్త్రంగా వాడుకుని.. అసంతృప్తులను బుజ్జగించటంతో పాటు, గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇంకొకరికి కేంద్రంలో అవకాశం ఇవ్వడం మంచిదనే అంచనాతో జాతీయ నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆశావహులైన నేతల్లో ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా ఉంది.ఈ కేంద్ర మంత్రివర్గ రేసులో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె.అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ జి. నగేశ్‌ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఈటల రాజేందర్, డి.కె.అరుణ ఇద్దరు నేతలు రేసులో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీ సామాజికవర్గం నుంచి బండి సంజయ్‌ కేంద్రమంత్రిగా ఉండగా.. బలమైన బీసీ నేతగా ఉన్న ఈటలకు కూడా అవకాశం రావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించిన డి.కె.అరుణ కూడా మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మహిళా కోటాలో తనకు అవకాశం దక్కుతుందని ఆమె ధీమాగా ఉన్నారు.అయితే, ఇప్పటికే రెడ్డి సామాజికవర్గం నుంచి కిషన్‌రెడ్డి క్యాబినెట్‌ మంత్రిగా కీలక బాధ్యతల్లో ఉండటం, అలాగే శాసనసభలో పార్టీ పక్ష నేత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. డి.కె.అరుణకు అవకాశం ఇస్తారా లేదా అన్న సంశయం కూడా ఉంది. ఇప్పటికే ఓసీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినందున.. గిరిజన సామాజికవర్గం నుంచి గడ్డం నగేశ్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చనే ప్రచారం కూడా నడుస్తోంది. అటు నిజామాబాద్‌లో వరుసగా రెండోసారి గెలిచిన ధర్మపురి అర్వింద్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తుది నిర్ణయం అధిష్ఠానానిదే కావడంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠ తప్పేలా లేదు.