ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట దక్కింది.. ప్రమోషన్లు, పోస్టుల అప్‌గ్రేడ్, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి అమల్లోకి రావాల్సిన ఫ్రీజింగ్ గడువును జులై 5కు పొడిగించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమల్లో భాగంగా సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు, పోస్టుల అప్‌గ్రేడ్‌కు ఈ నెల 25 నుంచి ఫ్రీజింగ్ అమల్లోకి వస్తుందని మెమో జారీ చేసింది. కానీ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించిన తర్వాత జులై 5 నుంచి ఫ్రీజింగ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సాధారణ పరిపాలన శాఖ జులై 5కు మారుస్తూ సవరణ మెమో జారీ చేసింది. జులై 5లోగా ప్రమోషన్లు, పోస్టుల అప్‌గ్రేడ్.. జూన్‌ 30 వరకు ఏర్పడే ఖాళీలకు ప్రమోషన్లకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.అమరావతి సచివాలయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు-2025పై 16 ఉద్యోగ సంఘాల నాయకులతో అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. రిటైర్మెంట్‌ ఖాళీలకు ప్రమోషన్లు ఇచ్చేందుకు వీలుగా జులై 5 వరకు ఫ్రీజింగ్‌ను సడలించాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాల నేతల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత.. కొత్త జిల్లా, జోన్, మల్టీ జోన్‌ క్యాడర్లకు ఉద్యోగుల్ని కేటాయించేందుకు మూడు అంచెల అమలు కమిటీలను ఏర్పాటు చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీ.. కో ఛైర్మన్‌గా కొత్త జిల్లా కలెక్టర్ ఉంటారు. జిల్లా క్యాడర్ల కేటాయింపుల్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే శాఖాధిపతుల కమిటీలో ఆయా శాఖకు చెందిన విభాగాధిపతి ఛైర్మన్‌గా జోనల్‌ క్యాడర్‌ ఉద్యోగుల కేటాయింపులను పూర్తి చేస్తారు. సచివాలయ స్థాయి కమిటీలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ ఛైర్మన్‌గా మల్టీ జోనల్‌ క్యాడర్‌ పోస్టుల కేటాయింపులు చూస్తారు. ఏపీ ప్రభుత్వం స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టనుండటంతో కొత్త పోస్టులు, పోస్టుల అప్‌గ్రేడేషన్, పునర్విభజన ప్రక్రియకు ఛాన్స్ ఇచ్చింది. ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించి డీపీసీ (డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ) సమావేశాలను శాఖల వారీగా త్వరగా నిర్వహించాలని ఆదేశించింది. ఒకవేళ ఇంతవరకు పదోన్నతులు రాని విభాగాల్లో అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు.. నాన్-సెలెక్షన్ పోస్టుల్లో అర్హత సాధించిన వారికి ప్రమోషన్లకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అవసరమైన చోట డిప్యుటేషన్లు, బదిలీలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఫ్రీజింగ్ గడువును జులై 5 వరకు పొడిగించడంతో ఉద్యోగులకు ఊరట దక్కింది.