: కొంత కాలంగా అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనైన సంగతి తెలిసిందే. చాలా వరకు పెద్ద పెద్ద స్టాక్స్ కూడా భారీగా పడిపోయాయి. మంచి పేరున్న కంపెనీలు కూడా తట్టుకోలేకపోయాయి. గత 3 నెలలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. అందుకే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు రిస్క్ ఉన్నా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుంటారు కానీ దానిపై అవగాహన ఉండాలి. స్టాక్ మార్కెట్ పతనమైతే దానికి తగ్గట్లుగా మ్యూచువల్ ఫండ్లలోనూ నష్టాలు వస్తుంటాయి. అందుకే ఇక్కడ రిస్క్ లేని పెట్టుబడి సాధనాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రిస్క్ లేనివి అంటే బ్యాంక్ ఎఫ్‌డీ, పోస్టాఫీస్ పథకాలు, ఆర్బీఐ బాండ్లు ఇలా చాలానే ఉన్నాయి..ఇక సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లు ఇంకా పెద్దగా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. వీరు ఎక్కువగా ఎంచుకునే పెట్టుబడి సాధనం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిాపాజిట్లే. ఇక్కడ నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం మీ పెట్టుబడికి అనుగుణంగా రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. ఇందులోనూ చాలా బ్యాంకులు ఉంటాయి. ఒక్కో బ్యాంకులో వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయి. వడ్డీ రేటులో కాస్త తేడా ఉన్నా మెచ్యూరిటీకి అందే వడ్డీ ప్రయోజనాలు కోల్పోవాల్సి రావచ్చు. అందుకే వడ్డీ రేట్లను పోల్చుకొని డిపాజిట్ చేయడం మంచిది. ఎక్కువగా పెద్ద పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి వాటిని ఎంచుకుంటుంటారు. ఇప్పుడు ఎస్బీఐలో వడ్డీ రేట్ల సంగతి చూద్దాం. ఇక్కడ కనీసం వారం నుంచి గరిష్ఠంగా పదేళ్ల వ్యవధి వరకు చూస్తే సాధారణ ప్రజలకు కనీసం 3.05 శాతం నుంచి గరిష్ఠంగా 6.45 శాతంగా ఉంది. అత్యధిక వడ్డీ రేటు 444 రోజుల స్పెషల్ అమృత్ వృష్టి పథకంపై వర్తిస్తుంది. ఇక సీనియర్ సిటిజెన్లకు చూస్తే కనీస వడ్డీ రేటు 3.55 శాతంగా ఉండగా గరిష్ఠంగా 5-10 ఏళ్ల వ్యవధిపై 7.05 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక ఇదే వ్యవధిపై సాధారణ ప్రజలకు చూస్తే వడ్డీ రేటు 6.05 శాతంగా ఉంది. మనం ఇప్పుడు ఐదేళ్ల వ్యవధికి సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజెన్లకు రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే వడ్డీ ఎంతొస్తుందో తెలుసుకుందాం. సాధారణ ప్రజలకు 6.05 శాతం వడ్డీ రేటు చొప్పున చూస్తే 5 లక్షలపై ఐదేళ్లకు వడ్డీ రూ. 1,75,088 వస్తుంది. అంటే మెచ్యూరిటీకి చేతికి రూ. 6,75,088 వస్తుంది. సీనియర్ సిటిజెన్లకు ఇదే ఐదేళ్లకు 7.05 శాతం వడ్డీ రేటు చొప్పున చూస్తే రూ. 2.09 లక్షల వడ్డీ వస్తుంది. మొత్తం చేతికి రూ. 7.09 లక్షలు వస్తాయి.