గత కొన్ని రోజులుగా తొలి దశ స్వాధీనం, రెండో దశ మెట్రో విస్తరణకు సంబంధించి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీజేపీ నేతల మధ్య తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కీలక పరిమాణం చోటు చేసుకుంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై చర్చించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి.. కేంద్రమంత్రులతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఎల్ అండ్ టీ సంస్థ వద్ద నుంచి హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవడంతోపాటు సెకండ్ ఫేజ్ విస్తరణకు కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సోమవారం రోజున కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు. ఉదయం నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలోనే సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ) రుణం, తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. మెట్రో ఫేజ్ -1 వాల్యుయేషన్, ఫేజ్ -2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్‌బీఐ క్యాప్స్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుందని ఈ సమావేశంలో కేంద్రమంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ ఎస్‌బీఐ క్యాప్స్ కన్సల్టెంట్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కన్సల్టెంట్‌లో సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారితోపాటు.. రాష్ట్ర పట్టణ వ్యవహారాల శాఖ స్పెషల్ సెక్రటరీ ఉంటారు.మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ ఎంత.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా టేకోవర్ చేసుకోవాలి.. ఫేజ్-2 విస్తరణకు ఐఆర్ఎఫ్‌సీ నుంచి తక్కువ వడ్డీకే రుణాన్ని ఎలా పొందాలి.. అనే విషయాలపై ఎస్‌బీఐ క్యాప్స్ సమగ్రంగా రిపోర్టును అందించనుంది. ఈ రిపోర్టు ఆధారంగానే కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ తదుపరి నిధుల విడుదలకు ఆమోదం తెలపనుంది. ఈ చర్చల్లో భాగంగానే తెలంగాణ సర్కార్.. కేంద్ర ప్రభుత్వానినికి సమర్పించిన రెండో దశ మెట్రో విస్తరణ ప్రణాళికలో భాగంగా దాదాపు 70 కిలోమీటర్ల పైగా కొత్త మార్గాలను ప్రతిపాదించినట్లు సమాచారం.