ఆంధ్రప్రదేశ్‌పై ద్రోణి ప్రభావం ఉందని చెబుతోంది వాతావరణశాఖ. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఈ ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణం పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.ఇవాళ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడే అవకాశం ఉందంటున్నారు. మంగళవారం ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలను వర్షాలపై హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల వానలు పడతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల సమయంలో.. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే.. చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెరువులు, ఫౌంటైన్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి నీటి వనరులకు.. బహిరంగ ప్రదేశాలకు ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటారని చెబుతున్నారు. చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడకూడదని సూచిస్తున్నారు. తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల పరులు పొలాల సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అంటున్నారు. వర్షం పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.