Gold Price In India: భారత విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు, చమురు సంక్షోభం వేళ దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటించాలని దేశ ప్రజలకు సూచించారు. మే 10, 2026 రోజున తెలంగాణలో పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికగా ఏడాది పాటు విచక్షణారహితంగా బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని 15 శాతం వరకు పెంచింది. ఈ చర్యల వల్ల దేశీయ మార్కెట్లో బంగారం, వెండి డిమాండ్ తగ్గింది. అయితే మరి ప్రధాని మోదీ పిలుపు తర్వాత దేశీయ మార్కెట్లో అనేది ఓసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.ప్రధాని మోదీ పిలుపు తర్వాత దేశీయ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు భారీగానే తగ్గాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచడం సైతం అందుకు ఓ కారణమైంది. దీంతో మే 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 10 గ్రాముల బంగారం ధర రూ.13000 పైన దిగివచ్చింది. అలాగే కిలో వెండి రేటు చూస్తే రూ.46 వేల వరకు తగ్గింది. మే 10, 2026 రోజున ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన రోజున 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,53,150 వద్ద ఉంది. అలాగే కిలో వెండి రేటు చూస్తే రూ.2,62,350 వద్ద ఉంది. ఇక జూన్ 28, 2026 ఆదివారం రోజున ఇండియన్ బులియన్ అసోసియేషన్ డేటా చూసుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,873కు దిగివచ్చింది. అలాగే కిలో వెండి రేటు రూ.2,16,541 వద్ద ట్రేడవుతోంది. దీని ప్రకారం చూస్తే 10 గ్రాముల బంగారం రేటు రూ.13,267, వెండి రూ.45,809 వరకు తగ్గాయి. సాధారణంగా నెలకు 75-100 టన్నులుగా ఉండే దిగుమతులు అది 25-30 టన్నులకు పరిమితయ్యాయి. మే నెలలో గోల్డ్ ఇంపోర్ట్స్ 39 శాతం తగ్గి 3.42 బిలియన్ డాలర్లకు పరిమితయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలోని ప్రధాన జువెలరీ హబ్‌లైన్ జైపూర్, పాట్నా వంటి నగరాల్లో బంగారం వ్యాపారం 50 శాతం నుంచి 80 శాతం మేర మందగించినట్లు సమాచారం. పెళ్లిళ్ల కొనుగోళ్లు తప్ప సామాన్యులు పెట్టుబడి రూపంలో చేసే విచక్షణారహిత కొనుగోళ్లను భారీగా తగ్గించడమే ఈ ధరల తగ్గింపునకు, మార్కెట్ స్లోడౌన్‌కు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.