ముంబై నగరం చరిత్రలోనే అతిపెద్ద విష ప్రయోగం కుట్రను పోలీసులు తిప్పికొట్టారు. మొహర్రం వేడుకల్లో పాల్గొన్న భక్తులకు పెయిన్ కిల్లర్ మాత్రల పేరిట కలిపిన క్యాప్సుల్స్ ఇచ్చి పెద్ద సంఖ్యలో ప్రాణ హాని తలపెట్టేందుకు కుట్ర పన్నిన వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ముంబైలోని బైకులా ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పుణేలోని విమాన్ నగర్‌కు చెందిన 39 ఏళ్ల ఫయాజ్ ప్రేమ్‌జీ మొహర్రం వేడుకల్లో పాల్గొంటున్న వారికి ‘పెయిన్ కిల్లర్’ క్యాప్సుల్స్ పంపిణీ చేశాడు.అతడి దగ్గర క్యాప్సుల్ తీసుకొని వేసుకున్న సల్మాన్ సయీద్ అనే 26 ఏళ్ల యువకుడు కాసేపటికే వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతణ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఈ సమయంలో హాస్పిటల్ నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బైకుల్లా పోలీసులు మొహర్రం వేడుకల్లో క్యాప్సుల్స్ పంచి పెడుతున్న ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ క్యాప్సుల్స్‌లో ఎలుకలను చంపడానికి ఉపయోగించే విషపదార్థమైన జింక్ ఫాస్ఫైడ్‌ను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఎందుకు ఇలా చేశావని నిందుతుణ్ని ప్రశ్నించగా.. నొప్పి నివారణ కోసం చేశానని చెప్పడం గమనార్హం. అతడి దగ్గర్నుంచి పెద్ద సంఖ్యలో క్యాప్సుల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గనుక సకాలంలో స్పందించకపోతే.. పరిస్థితి ఆందోళనకరంగా ఉండేది.బీబీఏ చదివిన ఫయాజ్ ప్రేమ్ జీ.. ఆన్‌లైన్‌లో ఈ క్యాప్సుల్స్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. డోంగ్రీలోని ఓ హోటల్‌లో అతడు ఉంటున్నట్లు గుర్తించారు. సయ్యద్ ఫిర్యాదుతో బైకుల్లా పోలీసులు భారత న్యాయ సంహితలోని సెక్షన్ 123 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్యాప్సుల్స్ పంచి పెట్టడానికి కారణాలేంటని పోలీసులు ప్రశ్నించగా.. ప్రేమ్ జీ సరైన వివరణ ఇవ్వలేకపోయాడు. దీంతో అతడి మానసిక స్థితి ఎలా ఉందనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.సీజ్ చేసిన క్యాప్సుల్స్‌ను కెమికల్ అనాలిసిస్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్యాప్సుల్స్‌లో అత్యంత విషపూరితమైన రసాయనం అయిన జింక్ ఫాస్ఫైడ్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు నిందితుడి గతాన్ని పరిశీలించగా.. అతడు ఇంతకు ముందు ఇరాక్, ఇరాన్ దేశాలకు వెళ్లినట్లు తెలిసింది.డీసీపీ ఏమన్నారంటే..?డీసీపీ జయంత్ మీనా న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘గత రాత్రి బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో మొహర్రం ఊరేగింపు సమయంలో ఓ అనుమానాస్పద వ్యక్తి క్యాప్సుల్స్ పంచడాన్ని ముంబై పోలీసులు గుర్తించారు. అతడి దగ్గర్నుంచి క్యాప్సుల్స్‌ను సీజ్ చేసి, ఇతర వివరాలు నమోదు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో సల్మాన్ అనే వ్యక్తి క్యాప్సుల్స్ తీసుకున్న తర్వాత వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు. పెద్ద సంఖ్యలో హాని తలపెట్టడం కోసం ఈ ఊరేగింపును లక్ష్యంగా చేసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అతడు 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్, 3 వేల ఖాళీ క్యాప్సుల్స్‌ను సమీకరించాడు. గత15 రోజులుగా ముంబైలో ఉంటూ ఖాళీ క్యాప్సుల్స్‌లో ఎలుకల ముందు నింపాడు. పెయిన్ కిల్లర్ల పేరిట వాటిని పంపిణీ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ముంబై పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటి వరకూ 14,90 క్యాప్సుల్స్‌ను సీజ్ చేశారు, మిగిలిన క్యాప్సుల్స్, కెమికల్స్ విషయమై దర్యాప్తు కొనసాగుతోంది. పెయింట్స్ బిజినెస్ చేసే నిందితుడు తన వ్యాపార సంబంధాల ద్వారా రసాయనాలను సేకరించి, క్యాప్సుల్స్‌ను ఆన్‌లైన్లో ఆర్డర్ చేశాడు. అతడి విదేశీ ప్రయాణ లింకులు, ముంబైలో అతడికి ఎవరు సహకరించారు అనే విషయమై దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు.మొహర్రం ఊరేగింపులో ఏం చేస్తారు..?మహ్మద్ ప్రవక్త మనవడైన ఇమామ్ హుస్సేన్ యాజిద్‌కు వ్యతిరేకంగా ధర్మపోరాటం చేశారు. ఈ పోరాటంలో ఇమామ్ హుస్సేన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు సహా మొత్తం 72 మంది అమరులయ్యారు. వీరి త్యాగాన్ని స్మరిస్తూ మొహర్రం నాడు ముస్లింలు తీవ్ర శోకాన్ని ప్రకటిస్తారు. ఈ క్రమంలోనే తీవ్ర భావోద్వేగానికి లోనై మొహర్రం ఊరేగింపులో తమను తామను కొరడాలతో కొట్టుకోవడం, బ్లేడ్లతో రక్తం కారేలా గాయపర్చుకోవడం లాంటివి చేస్తుంటారు.