తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ వచ్చింది. గతంలో ఆయనపై నమోదైన కేసుల విషయంలో బుధవారం రోజున కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన ఏకంగా 5 కేసులను.. సుదీర్ఘ విచారణ తర్వాత వాటన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పును ఇచ్చింది. హైకోర్టు తాజా తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డికి చట్టపరంగా ఎదురవుతున్న చిక్కులు తొలిగినట్లు అయింది.2019లో హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ చీఫ్‌గా ఉన్న .. విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి.. నిబంధనలను అతిక్రమించారంటూ రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ అధికారులు ఆయనపై అప్పట్లో పలు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుమతులు లేని చోట సభలను నిర్వహించడం, రోడ్‌షోలు ఏర్పాటు చేయడం వంటి కారణాలతో రేవంత్ రెడ్డిపై పోలీసులు 5 వేర్వేరు కేసులు నమోదు చేశారు.ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు మొత్తంగా రేవంత్ రెడ్డిపై 5 కేసులు నమోదు అయ్యాయి. ఈ 5 కేసులు చాలా కాలంగా పెండింగ్‌లోనే ఉండగా.. సుదీర్ఘంగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాజకీయ కక్షతోనే ఈ కేసులను తనపై పెట్టారని వాదిస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి.. ఆ కేసుల నుంచి తనకు రిలీఫ్ ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ 5 కేసులను పూర్తిగా కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి తరఫున లాయర్లు 5 వేర్వేరు క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా.. భారీ ఊరట లభించింది.ఈ క్వాష్ పిటిషన్లపై బుధవారం హైకోర్టులో తుది విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి తరఫు లాయర్లు బలంగా వాదనలు వినిపించగా.. సాధారణంగా రాజకీయ ప్రచారాల్లో జరిగిన సంఘటనలపై కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు వివరించారు. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు.. సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన ఆ 5 కేసులను పూర్తిగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.