హైదరాబాద్ లైఫ్ స్టైల్‌ విషయంలో మెట్రో రైల్ సంస్థ మరో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. మెట్రో స్టేషన్లను కేవలం ప్రయాణికుల రాకపోకల కేంద్రాలుగా పరిమితం చేయకుండా.. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌లు, కో వర్కింగ్ హబ్‌లు, శాటిలైట్ కార్యాలయాలుగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ (టీఓడీ) వ్యూహంలో భాగంగా రూపొందిన ఈ ప్రణాళికకు ఆఫీస్ బబుల్స్‌గా ప్రాధాన్యం పెరుగుతోంది. ఎల్‌బీ నగర్-మియాపూర్.. నాగోల్-రాయదుర్గం.. జేబీఎస్-ఎంజీబీఎస్ 3 మెట్రో కారిడార్ల పరిధిలోని 57 మెట్రో స్టేషన్లలో కార్యాలయాల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేబీఎస్ మెట్రో స్టేషన్‌లో కోహోర్ట్ కో వర్కింగ్ సెంటర్ కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గోల్డెన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇదే జేబీఎస్ స్టేషన్‌లో తన ఆఫీసును ఏర్పాటు చేసింది. దీంతో మెట్రో స్టేషన్‌లను వాణిజ్య, ఉపాధి కేంద్రాలుగా మలిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు అయింది. ఆఫీసులు, వ్యాపార కార్యకలాపాలను.. ప్రజా రవాణా వ్యవస్థతో అనుసంధానించడమే ఈ మోడల్ ప్రధాన లక్ష్యం. హైదరాబాద్‌లోని ఉద్యోగులు తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ వద్దే పనిచేసే అవకాశం కల్పించడం వల్ల.. ట్రాఫిక్ రద్దీలో నగరంలో సుదూర ప్రయాణాలు చేయడం తగ్గనుంది. దీని వల్ల సిటీ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడంతో పాటు మెట్రో వంటి ప్రజారవాణా వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఈ ఆఫీస్ బబుల్స్‌లో సంస్థలకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు.. నిరంతర విద్యుత్ సరఫరా.. సెక్యూరిటీ, మెరుగైన కనెక్టివిటీ.. ప్రీమియమ్ ఆఫీస్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సాధారణ కార్యాలయాల ఏర్పాటుతో పోలిస్తే రవాణా ఖర్చులు తగ్గే అవకాశం కూడా ఉంది. అయితే ఆఫీస్ స్థలంలో ఏవైనా నిర్మాణాత్మక మార్పులు లేదా ఇతర సవరణలు చేయాలంటే మాత్రం మెట్రో అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.ఈ విధానంపై నగరంలో పనిచేసే ఉద్యోగుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. నిత్యం ప్రయాణం కోసం వెచ్చించే సమయం, ఖర్చు తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తోందని పేర్కొంటున్నారు. సాధారణ ఆఫీసులతో పోలిస్తే ఈ మెట్రో బబుల్స్‌ పనితీరులో పెద్దగా తేడా లేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే వ్యక్తిగత వాహనాలతో వచ్చే ఉద్యోగులకు పరిమిత పార్కింగ్ సదుపాయం వీటికి పెను సవాలుగా మారవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.