మనమిత్ర వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ ఫిర్యాదులకు అవకాశం.. చంద్రబాబు కీలక ఆదేశాలు..

Wait 5 sec.

పాలనలో సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పౌర సేవల విషయంలో మరో సరికొత్త సంస్కరణ తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే ద్వారా వందల సంఖ్యలో పౌర సేవలను వాట్సాప్ ద్వారా మన చెంతకు చేర్చింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఇకపై గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించనుంది. సాధారణంగా ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు ఇకపై గ్రీవెన్స్ సెల్ వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే ఫిర్యాదు చేసేలా ప్రజలకు వీలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ప్రభుత్వ శాఖల పనితీరును సీఎం నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను మరింత అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. అలాగే ప్రజలకు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని కల్పించాలని స్పష్టం చేశారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలు కల్పించాలని సూచించారు. అలాగే వాయిస్ మెసేజ్‌ల రూపంలో వచ్చిన ఫిర్యాదులను కూడా స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఎక్కడా కూడా మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 3వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందన్న చంద్రబాబు.. మూడు నెలల్లోగా ఈ సమస్య పరిష్కరించాలని స్పష్టం చేశారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం వివిధ పౌర సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మొదలుకొని దేవాలయాల్లో టికెట్ల వరకూ వాట్సాప్ గవర్నె్న్స్ సేవలు అందిస్తోంది. పరీక్షా ఫలితాలు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల సమాచారాన్ని తెలియజేస్తోంది. రేషన్ కార్డులకు దరఖాస్తులు, మార్పులు, చేర్పులకు కూడా వాట్సాప్ ద్వారా అవకాశం కల్పిస్తోంది. తాజాగా మనమిత్ర ద్వారా ఫిర్యాదులు చేసేందుకు కూడా అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. వాయిస్ మెసేజుల రూపంలో వచ్చిన ఫిర్యాదులను కూడా స్వీకరించాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.