విద్యార్థులకు తీపి కబురు.. ఇక స్కూళ్లలోనే ఆధార్ సేవలు.. హైదరాబాద్ GPO వినూత్న నిర్ణయం

Wait 5 sec.

వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చిన్నారులు ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, రాయితీలు పొందాలన్నా ప్రస్తుతం ఆధార్ కార్డ్ అత్యంత కీలకంగా మారింది. అయితే.. చాలా మంది విద్యార్థుల ఆధార్ కార్డుల్లో తప్పులు ఉండటం, బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించకపోవడంతో అడ్మిషన్ల సమయంలో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ-సేవ, ఆన్‌లైన్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతూ, గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల యాజమాన్యాలు లేదా ప్రధానోపాధ్యాయులు కోరిన వెంటనే నేరుగా సదరు పాఠశాల ప్రాంగణంలోనే ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అక్కడికక్కడే సేవలు అందించేలా కొత్త సేవలను ప్రారంభించింది.ఈ మొబైల్ ఆధార్ కేంద్రాల ద్వారా విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సేవలను తపాలా శాఖ సిబ్బంది సమకూరుస్తారు. ఐదేళ్లు, పదిహేనేళ్లు దాటిన విద్యార్థులకు తప్పనిసరి అయిన బయోమెట్రిక్ అప్‌డేట్, కొత్త ఆధార్ నమోదు, ఫొటోల మార్పిడి, పేర్లలోని తప్పుల సవరణ, తండ్రి పేరు, అడ్రస్ మార్పులు, సెల్‌ఫోన్ నంబర్ అనుసంధానం, కేవైసీ అప్‌డేట్ వంటి అన్ని సేవలను స్కూల్ ప్రాంగణంలోనే పూర్తి చేస్తారు. ఈ సేవలు లభించాలంటే సదరు పాఠశాలలో కనీసం 50 మంది విద్యార్థులు ఆధార్ సేవలు అవసరమైన వారు ఉంటే సరిపోతుందని జీపీవో అధికారులు స్పష్టం చేశారు.తమ విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలల్లోనే ఈ ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయాలని భావించే స్కూల్ యాజమాన్యాలు ముందుగా జీపీవో అబిడ్స్‌ను సంప్రదించి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సులభంగా సంప్రదించేందుకు వీలుగా తపాలా శాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. పాఠశాలల ప్రతినిధులు 76590 99628, 94404 54582 లేదా ల్యాండ్‌లైన్ నంబర్ 040 23463595 ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. అలాగే cpmhydgpo@gmail.com ఈమెయిల్ ఐడీ ద్వారా కూడా తమ అభ్యర్థనలను పంపవచ్చు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు సంబంధిత పాఠశాల పరిసర ప్రాంతాల్లో తపాలా శాఖ ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు 8 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు సమయం కలిసి రావడమే కాకుండా.. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చదువులపై పూర్తి శ్రద్ధ పెట్టే అవకాశం లభిస్తుందని విద్యావేత్తలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.