: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటైన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (సీఎస్ఎమ్ఐఏ) లో చోటుచేసుకున్న ఒక వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విమానాశ్రయంలోని అంతర్జాతీయ ప్రయాణికులు ఫామ్‌లు పూర్తి చేసే కౌంటర్ వద్ద ఒక పెన్ రీఫిల్‌ను దారంతో గట్టిగా కట్టి ఉంచడం ఒక ట్రావెల్ వ్లాగర్ కంట పడింది. దీంతో ఆయన దాన్ని రికార్డ్ చేసి నెట్టింట పెట్టడంతో.. సరికొత్త చర్చకు దారి తీసింది. ముఖ్యంగా "ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ పెన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది" అంటూ సదరు కంటెంట్ క్రియేటర్ దీపక్ సమల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వ్యంగ్య వీడియో తెగ వైరల్ కాగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. ముఖ్యంగా విమానాశ్రయ అధికారులు కూడా దీనిపై స్పందించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. అసలేం జరిగిందంటే..?వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో దీపక్ సమల్ మాట్లాడుతూ.. "ఇది ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. భారత్‌కు వచ్చే విదేశీయులు ఇక్కడ ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పెన్ రీఫిల్‌కు కల్పించిన భద్రత" అని ఎగతాళి చేశారు. ఇంత పెద్ద ఎయిర్‌పోర్టులో కనీసం ఒక పెన్ కూడా అందుబాటులో ఉంచలేకపోవడం విచారకరమన్నారు. "భారత్‌కు తొలిసారి వచ్చే విదేశీ ప్రయాణికులకు మన దేశంపై ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది? కేవలం పెన్ ఒక్కటే కాదు. ప్రతీ చిన్న విషయం దేశ ప్రతిష్టను ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ ఎయిర్‌పోర్ట్ గౌరవాన్ని కాపాడటానికి, తోటి ప్రయాణికుల సౌకర్యార్థం నా సొంత పెన్‌ను ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రపంచ స్థాయి దేశం అనేది ప్రపంచ స్థాయి ప్రాథమిక వసతులపైనే నిర్మితమవుతుందని ఆయన క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. "మనం పెద్ద పెద్ద మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్నాం. కానీ ప్రజల్లో, అధికారుల్లో సరైన ఆలోచనా విధానం ఎప్పుడు వస్తుంది?" అని ప్రశ్నించారు. అయితే మరో సెక్షన్ నెటిజన్లు ఎయిర్‌పోర్ట్ యాజమాన్యానికి మద్దతుగా నిలిచారు. "నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. అక్కడి కస్టమ్స్ కౌంటర్లలో అస్సలు పెన్నులు పెట్టరు. సొంతంగా తెచ్చుకోవాలి లేదా ఇతరులను అడగాలి. అలాంటిది ఇక్కడ కనీసం రీఫిల్ అయినా కట్టడం మంచిదే" అని ఒకరు సమర్థించగా.. "ఇది దొంగల భయం కోసం కాదు. ప్రయాణికులు పొరపాటున హడావుడిలో పెన్నులు జేబులో వేసుకుని వెళ్లకుండా, కింద పడిపోకుండా ఉండటానికే విదేశాల్లో కూడా ఇలాంటి పద్ధతి పాటిస్తారు. దీనికి దేశ ప్రతిష్టను ముడిపెట్టనవసరం లేదు" అని మరొకరు కామెంట్ చేశారు. తప్పు తెలుసుకుని స్పందించిన ముంబై ఎయిర్‌పోర్ట్..!ఏది ఏమైనా ఈ వీడియోకు సోషల్ మీడియాలో దాదాపు 2.5 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారిక యంత్రాంగం దీనిపై స్పందించక తప్పలేదు. ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ.. "గౌరవనీయ ప్రయాణికులకు ధన్యవాదాలు. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. కౌంటర్ వద్ద ఉన్న ఆ తాడుతో కట్టిన రీఫిల్‌ను తక్షణమే తొలగించాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు, దిద్దుబాటు చర్యలు చేపట్టాం. మా సేవా ప్రమాణాలను అత్యున్నతంగా ఉంచడానికి మీ ఫీడ్‌బ్యాక్ ఎంతగానో సహాయ పడుతుంది" అని అధికారిక ప్రకటన విడుదల చేశారు.