Post Office : పెట్టుబడులు అంటే ముందుగా చాలా మందికి గుర్తొచ్చేది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మెరుగైన రాబడి కోసం చాలా మంది ఇక్కడ డబ్బుల్ని పెడుతుంటారు. ఇక సేవింగ్స్ స్కీమ్స్ అంటే పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి గుర్తుకొస్తాయి. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేకుండా నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం రాబడి వస్తుంది. ఇక్కడే తెలుసుకోవాల్సిన మరో ఆప్షన్ కూడా ఉంది. అదే (RD). ఇది కూడా చాలా సురక్షితమైన పెట్టుబడి పథకం. చాలా మందికి దీని గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఇది సరిగ్గా సిప్‌ను పోలి ఉంటుంది. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే నిర్దిష్ట మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ అంటే నిర్దిష్ట కాల పరిమితికి నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి రాబడి వస్తుంది. అదే రికరింగ్ డిపాజిట్ విషయానికి వస్తే ఇక్కడ నిర్దిష్ట కాల పరిమితితో నెలనెలా డబ్బుల్ని జమ చేస్తూ వెళ్లాలి. అప్పుడు నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి మెచ్యూరిటీకి రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ సిప్‌లోనూ పెట్టుబడి విధానం ఇలానే ఉంటుంది కానీ అక్కడ నిర్దిష్ట వడ్డీ రేట్లు అంటూ ఉండవు. బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంది. బ్యాంకుల్లో FD మాదిరిగానే ఆర్‌డీపైనా వేర్వేరు టెన్యూర్లకు పెట్టుబడికి అవకాశాలు ఉండగా, పోస్టాఫీసులో కేవలం ఐదేళ్ల టెన్యూర్‌తో మాత్రమే ఉంది. బ్యాంకుల్లో గరిష్ఠంగా పదేళ్ల వరకు కూడా ఉంటుంది. చాలా బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఐదేళ్ల కాలానికి 6-7 శాతం వరకు ఉన్నాయి. ఇక పోస్టాఫీసులో ఐదేళ్ల ఆర్‌డీ వడ్డీ రేటు ప్రస్తుతం 6.70 శాతంగా ఉంది. ఇప్పుడు ప్రముఖ బ్యాంకులు, పోస్టాఫీసు ఆర్‌డీపై ఐదేళ్ల కాల వ్యవధికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఇంకా నెలకు రూ. 25 వేల చొప్పున జమ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC లో ఐదేళ్ల టెన్యూర్ ఆర్‌డీ వడ్డీ రేటు 6.40 శాతంగా ఉంది. ఇక్కడ నెలకు రూ. 25 వేల చొప్పున ఐదేళ్లకు అంటే మొత్తం రూ. 15 లక్షల పెట్టుబడిపై వడ్డీతో రూ. 2,70,102 పొందొచ్చు. మెచ్యూరిటీకి చేతికి మొత్తం రూ. 17,70,102 వస్తుంది. ఎస్బీఐలో 6.30 శాతంగా వడ్డీ రేటు ఉండగా ఇక్కడ నెలకు రూ. 25 వేల పెట్టుబడితో వడ్డీతో రూ. 2,65,457 వస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకులో 6.50 శాతంగా వడ్డీ రేటు ఉంది. ఇక్కడ వడ్డీతో రూ. 2,74,771 వస్తుంది. ఇదే పోస్టాఫీసులో చూస్తే వడ్డీ రేటు 6.70 శాతంగా ఉండగా, రూ. 15 లక్షల పెట్టుబడిపై వడ్డీతో రూ. 2,84,148 పొందొచ్చు. అంటే ఇక్కడ అన్నింటికంటే ఎక్కువగా పోస్టాఫీసులోనే రాబడి కాస్త అధికంగా ఉందని చెప్పొచ్చు.