కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పాలనపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను పక్కనపెట్టి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో స్కామ్‌లు తప్ప స్కీమ్‌లు లేవని విమర్శించారు. ఈ క్రమంలోనే పీఎం కుసుమ్ పథకంలో దాదాపు రూ.వెయ్యి కోట్ల భారీ కుంభకోణం జరిగిందని జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఈ కుంభకోణంలో కొంతమంది పెద్ద నేతల పేర్లు కూడా వినబడుతున్నాయని ఆరోపించారు. ఆ ఆరోపణలపై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలపై స్పందించిన జగదీష్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ పదవికి ఎసరు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని జగదీష్ రెడ్డి ఖండించారు. నిజానికి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి.. బీజేపీ, హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటి అయ్యాయనే విషయం స్పష్టంగా తేలిపోయిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జట్టు కట్టారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, మోదీ ఆలోచనల నుంచి పుట్టిన ఒక క్రాస్ బ్రీడ్, హైబ్రిడ్ సీఎం ప్రస్తుతం రాష్ట్ర పాలన సాగిస్తున్నారని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తూ.. నేషనల్ బ్యాంకులను భయపెడుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేసినందుకే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మిగిలిన కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇది చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి పీఏ లాగా పని చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.