జీవితంలో క్షణికావేశంలో తప్పులు చేసేవారు కొందరు ఉంటారు.. తెలిసి తెలియక తప్పు చేసేవారు మరికొందరు ఉంటారు. ఇలా జీవితంలో నేరాలకు పాల్పడి జైలు జీవితం గడిపేవారు ఎందరో ఉన్నారు. జైలుకు వెళ్లాక జీవితం నరకం, అక్కడ నిబంధనలు ఎంతో కఠినంగా ఉంటాయనే భావన ఉంటుంది. కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జైళ్లంటే శిక్ష అనుభవించడం ఒక్కటే కాదు.. జీవితంలో చేసిన తప్పును తెలియజేసి ఖైదీలను సరైన మార్గంలో నడిపించే సరికొత్త మార్గంగా మారాయి. జైలులోనే ఉపాధి మార్గాలను చూపుతూ విడుదలయ్యాక తమకాళ్లపై తాము నిలబడేలా జీవితాలను మార్చే్స్తున్నాయి. వ్యవసాయం, చేతివృత్తులు, పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటుగా చదువుకునేవారికి కూడా ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి.తాజాగా విశాఖపట్నం సెంట్రల్ జైలులో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ కార్పొరేట్‌ స్థాయి ఐటీ నైపుణ్య శిక్షణ ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఈ వినూత్నమైన విధానం ఇక్కడే మొదలైంది. ఈ మేరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌డీఐ) సహకారంతో ప్రత్యేకంగా ‘ఆఫీస్‌ అసిస్టెంట్‌’ కోర్సుకు శిక్షణ ఇస్తున్నారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న16 బ్యారక్‌లలో శిక్ష ఖరారైన, రిమాండ్‌ ఖైదీలు 2వేల మందికి పైగా ఉన్నారు. వీరిలో 1,100 మంది గంజాయి కేసుల్లో దొరికిపోయిన వారు ఉన్నారు. వీరలో ఇంటర్, డిగ్రీ సహా ఆ పైన చదువుకున్నవారిలో 30మంది రిమాండ్ ఖైదీలను (యువకుల్ని) అధికారులు ఎంపిక చేసుకున్నారు. రెండు నెలలపాటు ఈ 30మందికి ఎంఎస్‌ ఆఫీస్, డిజిటల్‌ కమ్యూనికేషన్, ఇంటర్నెట్‌ అప్లికేషన్స్, ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఇతర అంశాలపై నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమంలో కూడా భాగస్వాములను చేస్తున్నారు.జైల్లో ఈ 30మందికి శిక్షణ ఇచ్చేది కూడా ఖైదీగా ఉన్న ఓ ప్రొఫెసర్‌ కాడం విశేషం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ ఒకరికి చెన్నై కోర్టు పదేళ్ల పాటూ జైలు శిక్ష విధించింది. ఆయన తనను స్థానంగా ఉండే జైలుకు పంపాలని కోరడంతో విశాఖపట్నం జైలుకు పంపారు. ఆయన మద్రాస్ ఐఐటీలో ఇంజినీరింగ్, ఎంటెక్, ఎంఎస్ కూడా చేశారు. ఆయన ఇస్రోలో, ఆ తర్వాత గుజరాత్‌లోని దీన్‌దయాళ్‌ కెమికల్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అందుకే ఆయన్ను ఖైదీలకు ఈ ఐటీ పాఠాలు బొధించేందుకు ఎంపిక చేశారు. ఆయన ఖైదీలకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో ఎస్‌డీఐ తొలుత అవగాహన కల్పించింది. ప్రస్తుతం ఆఫీస్ అసిస్టెంట్ కోర్సుకు సంబంధించిన శిక్షణ అందిస్తున్నారు. అలాగే వార్డర్ వారానికి ఒకసారి ఆన్‌లైన్‌లో ఎస్‌డీఐ ప్తరినిధుల శిక్షణలో కూడా భాగస్వాములు అవుతారన్నారు. మే 21న ఈ శిక్షన ప్రారంభం కాగా.. మరో నెలలో ముగియనుంది. విశాఖపట్నంలో ఉన్న జ్ఞానసాగర్‌ బ్లాక్‌లో నైపుణ్య శిక్షణకు సంబంధించి గతంలో ఉన్న లైబ్రరీ, ల్యాబ్, కంప్యూటర్లనే ఐటీ వినియోగిస్తున్నారు. అంతేకాదు ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకునే ఖైదీలకు జైలు ముద్ర కూడా లేకుండా కేంద్రం గుర్తింపు ఉన్న సర్టిఫికెట్లను కూడా అందజేస్తారు. ఈ శిక్షణ పూర్తయ్యాక వీరంతా మళ్లీ నేరాలు వైపు వెళ్లకుండా సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా స్థిరపడేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు జైలు అధికారులు. రాష్ట్రంలోనే తొలిసారి ఐటీ ఆధారిత శిక్షణను విశాఖపట్నం జైలలో ప్రవేశ పెట్టామంటున్నారు. ఖైదీల్లో పరివర్తనంతో పాటుగా బాధ్యతాయుతమైన, నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దుతామన్నారు.